ఆరోగ్యానికి రూ.90,658 కోట్లు.. టీకాల వ్యవస్థకు ‘యూ-విన్’

by Dishanational4 |
ఆరోగ్యానికి రూ.90,658 కోట్లు.. టీకాల వ్యవస్థకు ‘యూ-విన్’
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.90,658 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.89,155 కోట్లు అలాట్ చేశారు. ఈ లెక్కన కేటాయింపుల్లో పెద్ద తేడా ఏమీ చోటుచేసుకోలేదు. రూ.90వేల కోట్ల ఆరోగ్యరంగ బడ్జెట్‌లో రూ.87,656 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, మిగతా రూ.3001 కోట్లను ఆరోగ్య పరిశోధనా రంగానికి కేటాయించారు. ఈ మొత్తం కేటాయింపుల్లో రెవెన్యూ వ్యయం రూ.86,306 కోట్లు ఉండగా, మూలధన వ్యయం రూ. 4352 కోట్లు ఉంది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి మూలధన వ్యయంలో దాదాపు రూ.1000 కోట్లు కోతపెట్టారు. 2023-24 బడ్జెట్‌లో మూలధనం వ్యయం కోసం రూ.5300 కోట్లను కేటాయించారు.

ఆరోగ్యరంగ కేటాయింపులు ఇలా..

* ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సంరక్షణ కల్పించే స్కీమ్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్సపొందే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీని అందిస్తుంది.

* టీకాలకు సంబంధించిన వ్యవస్థ నిర్వహణ కోసం యూ-విన్(U-Win) అనే కొత్త యాప్‌ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ త్వరలో దేశవ్యాప్తంగా విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

* ప్రసూతి, శిశు ఆరోగ్య సంరక్షణ కోసం ఇప్పటికే ఉన్న వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కలిపి ఒక సమగ్ర కార్యక్రమం కిందకు తీసుకొస్తారు.

* 9 నుంచి 14 ఏళ్ల వయసు కలిగిన బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సినేషన్‌ తీసుకునేలా ప్రోత్సహించనున్నారు.



Next Story

Most Viewed