మహారాష్ట్రలో మరో ఫ్రంట్ ఏర్పాటు: వీబీఏ చీఫ్ ప్రకాష్ అంబేడ్కర్

by Dishanational2 |
మహారాష్ట్రలో మరో ఫ్రంట్ ఏర్పాటు: వీబీఏ చీఫ్ ప్రకాష్ అంబేడ్కర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో సీట్ల పంపకాల విషయంలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేడ్కర్ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ‘బీజేపీని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని వివిధ సంస్థలతో చర్చిస్తాం. ఏప్రిల్ 2న చర్చల తర్వాత తదుపరి ప్రణాళిక ప్రకటిస్తాం’ అని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలపై మరాఠా రిజర్వేషన్ కార్యకర్త మనోజ్ జరాంగే పాటిల్‌తో సమావేశమయ్యానని, ప్రతి నియోజకవర్గం నుంచి మరాఠా అభ్యర్థులను నిలబెట్టేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వీబీఏ క్యాండిడేట్స్ జాబితాను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు.

శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పినప్పటికీ, ఎంవీఏలో విభేదాలు రావడానికి ఆయనే కారణమని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తూ..అసెంబ్లీ కార్యక్రమాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో ప్రస్తుతం మహాయుతి కూటమి, ఎంవీఏ కూటమి ఉన్నాయి. మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ(అజిత్) పవార్ వర్గం భాగస్వామిగా ఉన్నాయి. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ చంద్రపవార్) పార్టీలు ఉన్నాయి. ఎంవీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న వీబీఏ సీట్ షేరింగ్ విషయంలో విభేదాలు రావడంతో ఇటీవల కూటమిని వీడుతున్నట్టు ప్రకటించారు.



Next Story

Most Viewed