మన్మోహన్ సర్కారుకు.. మోడీ సర్కారుకు తేడా అదే : బిసారియా

by Dishanational4 |
మన్మోహన్ సర్కారుకు.. మోడీ సర్కారుకు తేడా అదే : బిసారియా
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబైపై దాడి చేసిన సమయంలో దౌత్యపరంగా చోటుచేసుకున్న పరిణామాలను రిటైర్డ్ దౌత్యవేత్త అజయ్ బిసారియా వెల్లడించారు. 26/11 ఎటాక్ తర్వాత భారత్ దౌత్యపరంగా చూపిన సహనం, సంయమనం.. పాకిస్తాన్‌కు తప్పుడు సందేశాన్ని పంపిందన్నారు. ‘యాంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్థాన్’ అనే పుస్తకాన్ని రచించిన అజయ్ బిసారియా దాని ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలో ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2008లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే సర్జికల్‌ స్ట్రైక్‌, వైమానిక దాడులు వంటి ఆపరేషన్లు చేసి ఉంటే.. ఉగ్రవాదులకు మద్దతిచ్చే విధానాన్ని పాక్‌ ఆర్మీ ఆపేసి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మెజారిటీ ఉన్న ప్రభుత్వ ఆదేశాలతో..

బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్ చేయడం ద్వారా భారత ప్రభుత్వం, భద్రతా దళాలు పాకిస్తాన్‌కు తగిన సందేశాన్ని పంపడంలో విజయం సాధించాయన్నారు. స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వ ఆదేశాలతో జరిగిన ఈ దాడులు దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా నాయకత్వంపై విశ్వాసాన్ని పెంచాయని అజయ్ బిసారియా పేర్కొన్నారు. ‘‘1980 నుంచి మూడు దశాబ్దాల పాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్‌కు స్పష్టమైన వైఖరి లేదు. చాలా సందర్భాలలో భారత్ సహనం, సంయమనం పాకిస్తాన్‌కు తప్పుడు సందేశం పంపింది’’ అని చెప్పారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై 1980 నుంచే భారత్ కఠిన చర్యలు తీసుకొని ఉంటే వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగే వాళ్లమన్నారు. రాజకీయ నాయకులు అప్పుడు, ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని తెలిపారు.

Next Story

Most Viewed