ఈడీ, ఐటీ రైడ్స్‌తో ఎన్నికల విరాళాలకు లంకె.. ఆధారాలు అవేనా ?!

by Dishanational4 |
ఈడీ, ఐటీ రైడ్స్‌తో ఎన్నికల విరాళాలకు లంకె.. ఆధారాలు అవేనా ?!
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్ల జారీ ద్వారా రాజకీయ పార్టీలు సేకరించిన భారీ విరాళాల చిట్టాతో ముడిపడిన ఆసక్తికర వివరాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) రైడ్స్‌కు.. కొన్ని కంపెనీల విరాళాలకు సంబంధం ఉందని సూచించే పలు ఆధారాలు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాటిలో ప్రస్తావించిన కొన్ని అంశాలను మనం ఓసారి పరిశీలిద్దాం..

రూ.1,368 కోట్లు.. సగం రైడ్స్‌కు ముందు.. సగం రైడ్స్ తర్వాత

రాజకీయ పార్టీలకు దేశంలోనే అత్యధికంగా రూ.1,368 కోట్లు విరాళం ఇచ్చిన ఘనత ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్‌ కంపెనీది. ఈ కంపెనీ అధిపతి పేరు శాంటియాగో మార్టిన్. లాటరీ స్కాం విచారణలో భాగంగా 2022 ఏప్రిల్ 2న మనీ లాండరింగ్ చట్టాన్ని ప్రయోగించిన ఈడీ.. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి చెందిన రూ.410 కోట్లు విలువైన చరాస్తులను అటాచ్ చేసింది. ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత.. 2022 ఏప్రిల్ 7న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ రూ.100 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రూ.1,368 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్లలో సగం ఈడీ రైడ్స్‌కు ముందు, సగం ఈడీ రైడ్స్ తర్వాత కొనేయడం గమనార్హం. ఇక తమిళనాడు రాష్ట్రంలోని శాంటియాగో మార్టిన్ నివాసాలు, కార్యాలయాలు లక్ష్యంగా 2023 మేలోనూ ఈడీ రైడ్స్ చేసింది.

రూ.573 కోట్ల విరాళం..

ఎన్నికల బాండ్ల ద్వారా భారీ విరాళాలు ఇచ్చిన కంపెనీ లిస్టులో కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్‌ఫ్రా, ఎంకేజే ఎంటర్‌ప్రైజెస్, మదన్‌లాల్ లిమిటెడ్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి దాదాపు రూ.573 కోట్లను రాజకీయ పార్టీలకు విరాళంగా అందించాయి. దాతల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్ తర్వాత ఇంత భారీ రేంజ్‌లో విరాళం ఇచ్చిన మూడో పెద్ద వ్యాపార గ్రూప్‌గా కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్‌ఫ్రా నిలిచింది. దాదాపు రూ.185 కోట్లు విలువైన ఎన్నికల బాండ్‌లను 2019 మే 8, 10 తేదీల్లో మదన్‌లాల్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. అంతకుముందు 2017లో పశ్చిమ బెంగాల్ స్థానిక మెట్రో డెయిరీలోని 47 శాతం ప్రభుత్వం తరఫు షేర్లను రూ.85 కోట్లకే కెవెంటర్ ఆగ్రో లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విక్రయించింది. అయితే దీనిపై 2019లో ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. విచారణలో భాగంగా 2021 ఫిబ్రవరిలోనూ కోల్‌కతాలోని కెవెంటర్ ఆగ్రో లిమిటెడ్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.

యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్..

హైదరాబాద్‌లోని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రూప్‌పై 2020 డిసెంబరులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేసింది. 2021 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్యకాలంలో అనేక విడతల్లో రూ.162 కోట్లను ఈ కంపెనీ ఎన్నికల విరాళంగా అందించింది.ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిని 2022 నవంబర్ 10న ఈడీ అరెస్టు చేసింది. ఇది జరిగిన ఐదురోజుల తర్వాత (నవంబర్ 15న) కంపెనీ రూ.5 కోట్లు విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఒక సంవత్సరం తర్వాత 2023 నవంబరులోనూ రూ.25 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లను అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. కడప శివార్లలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో ఉన్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని ఆఫీస్‌తో పాటు ఉన్నతాధికారుల నివాసాలపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కంపెనీ 2024 జనవరి 11న రూ.40 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.

Next Story

Most Viewed