ఎన్నికల బాండ్లతో బీజేపీ ‘క్విడ్‌ ప్రో కో’ : కపిల్ సిబల్

by Dishanational4 |
ఎన్నికల బాండ్లతో  బీజేపీ ‘క్విడ్‌ ప్రో కో’ : కపిల్ సిబల్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల స్కీం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణమని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు బీజేపీకి చెందిన బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయాలని కోరారు. ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల తర్వాతే ఇన్ని కంపెనీలు బీజేపీకి ఎందుకు విరాళాలు ఇచ్చాయో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. విరాళాలు ఇచ్చేలా ఆయా కంపెనీలపై ఎవరు ఒత్తిడి తెచ్చారో తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం బయటపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బీజేపీ అనుసరిస్తున్న అవినీతి వ్యూహాలను బహిర్గతం చేశాయని ఖర్గే పేర్కొన్నారు. ‘‘ఈడీ, ఐటీ దాడులను ఎదుర్కొన్నవారు బీజేపీలోకి వెళ్లి పార్టీ పదవులు పొందారు. ఆ పార్టీలోకి వెళ్లిన వాళ్లంతా మిస్టర్ క్లీన్ అయిపోయారు’’ అని ఆయన విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా బీజేపీకి దాదాపు 50 శాతం విరాళాలు లభించగా, కాంగ్రెస్‌కు 11 శాతమే వచ్చాయన్నారు. ‘‘ప్రధాని మోడీ నేను తినను.. ఇతరులను తిననివ్వను అని అంటుంటారు. ఆయన చెప్పేవన్నీ వట్టి మాటలని తేలిపోయింది. కేవలం బీజేపీకే తినే అవకాశమిస్తా అనేలా మోడీ వ్యవహరిస్తున్నారు’’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది. ఎలక్టోరల్ బాండ్లతో అవకతవకలకు పాల్పడినా బీజేపీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. బ్యాంకు అకౌంట్లలో మా పార్టీకి చెందిన దాదాపు రూ.300 కోట్లు స్తంభించిపోయాయి. ఎన్నికలను మా పార్టీ ఎలా ఎదుర్కోవాలి ?’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘రాజకీయ ప్రత్యర్ధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు ? ’’ కేంద్ర ప్రభుత్వాన్ని ఖర్గే నిలదీశారు.

అదొక ‘క్విడ్‌ ప్రో కో’ మార్గం : సిబల్

ఎన్నికల బాండ్లను క్విడ్ ప్రోకో కోసం బీజేపీ వాడుకుందని కపిల్‌ సిబల్‌ ఆరోపించారు. బాండ్ల ఐడీ నంబర్లను వెల్లడించాలని, తద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే విషయం తెలిసిపోతుందన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నిద్రాణస్థితిలో ఉన్నట్టుగా స్పందిస్తోందని దుయ్యబట్టారు.

ప్రజాకోర్టుకు వెళ్తాం : జైరాం రమేశ్

‘‘ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం మాకు ఉంది.. మేం ప్రజా కోర్టుకు వెళ్తాం’’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ వెల్లడించారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదన్నారు. వీవీప్యాట్‌ల స్లిప్పుల అంశంపై తమ విజ్ఞప్తిని తెలియజేసేందుకు ఏడాదిగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతున్నా అటునుంచి స్పందన రావడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఎన్నికల సంఘం ఎందుకు భయపడుతోందని జైరాం రమేశ్ ప్రశ్నించారు.

Next Story

Most Viewed