తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ : ఏ రాష్ట్రం.. ఎన్ని స్థానాలు ?

by Dishanational4 |
తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ : ఏ రాష్ట్రం.. ఎన్ని స్థానాలు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్‌ బుధవారం విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నామినేషన్లను సమర్పించేందుకు చివరి తేదీ.. వివిధ రాష్ట్రాలకు ఒక్కో విధంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడులకు నామినేషన్ల సమర్పణ గడువు మార్చి 27 వరకు ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరుగుతుంది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 వరకు అవకాశమిస్తారు. బిహార్‌లో మాత్రం అభ్యర్థుల నామినేషన్ల సమర్పణకు గడువు మార్చి 28 వరకు ఉంటుంది. అక్కడ ఈనెల 30న నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 2 వరకు గడువు ఇచ్చారు.

అత్యధికంగా తమిళనాడులోని 39 స్థానాల్లో..

తొలి విడతలో భాగంగా ఏప్రిల్‌ 19న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రాలవారీగా చూస్తే.. తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తరప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అస్సాంలలోని 5, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయల్లోని చెరో రెండు, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిలలోని ఒక్కో లోక్‌సభ స్థానంలో పోలింగ్ జరుగుతుంది. ఇక ఏప్రిల్ 26న రెండో దశలో 89 నియోజకవర్గాలకు, మూడో దశలో 94, నాలుగో దశలో 96, ఐదో దశలో 49, ఆరో దశలో 57, ఏడో దశలో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

వారికి వేతనంతో కూడిన సెలవు

ఏప్రిల్ 19, 26 తేదీల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని కార్యాలయాలు, సంస్థలకు పోలింగ్ తేదీల్లో వేతనంతో కూడిన సెలవును రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్, పారిశ్రామిక సంస్థల సిబ్బందికి కూడా ఈ సెలవు వర్తిస్తుందని వెల్లడించింది.

Next Story

Most Viewed