ఎలక్టోరల్ బాండ్ల విరాళాలపై ఈసీ కీలక ప్రకటన

by Dishanational4 |
ఎలక్టోరల్ బాండ్ల విరాళాలపై ఈసీ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్లపై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమకు మంగళవారం సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల విరాళాల సమాచారాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సకాలంలో వెల్లడిస్తామని తెలిపారు. మార్చి 15న సాయంత్రం 5 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు రాజీవ్ కుమార్ బుధవారం జమ్మూలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఢిల్లీకి తిరిగి వెళ్లగానే ఎస్‌బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని పరిశీలిస్తాను. దాన్ని సకాలంలో విడుదల చేస్తాను’’ అని ప్రకటించారు. ‘‘ఎన్నికల సంఘం తొలి ప్రాధాన్యత పారదర్శకతకే. ఎన్నికల టైంలో ఎన్నికల సంఘం తరఫున జిల్లా మేజిస్ట్రేట్‌లు చేసేది కూడా అదే. మాకు రెండు విషయాలే ముఖ్యం.. అవే.. బహిర్గతం చేయడం, బహిర్గతం చేయడం’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘ఎన్నికల సంఘం ఏమేం చేస్తుందో తెలుసుకునే హక్కు ఓటరుకు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈసీ సిద్ధంగా ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశ ప్రజలంతా ఉత్సాహంగా ప్రజాస్వామ్యపు పండుగలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎస్‌బీఐ అఫిడ‌విట్‌లో..

ఇదే అంశంపై తాజాగా బుధవారం సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ ఒక అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. 2019 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేశామని అందులో ప్రకటించింది. వీటిలో 22,030 ఎలక్టోరల్ బాండ్ల‌ను రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్నాయని వెల్ల‌డించింది. ఈ అఫిడ‌విట్‌లోనే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల లెక్కలను కూడా ప్రస్తావించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘాని(ఈసీ)కి కూడా బాండ్ల‌పై డేటాను స‌మ‌ర్పించిన‌ట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల స‌మాచారాన్ని ఈసీకి పెన్‌డ్రైవ్‌లో అందజేసినట్లు పేర్కొంది. రెండు పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ష‌న్‌తో రాజకీయపార్టీల విరాళాల వివరాలన్నీ ఈసీకి ఇచ్చిన‌ట్లు ఎస్బీఐ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లు ఆ డాక్యుమెంట్స్‌లో ఉన్నాయని వివరించింది.

Next Story

Most Viewed