మల్లికార్జున ఖర్గే హత్యకు కుట్ర.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ

by Disha Web Desk 12 |
మల్లికార్జున ఖర్గే హత్యకు కుట్ర.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ
X

బెంగళూరు : కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన భార్య, కుటుంబ సభ్యులందరినీ తుడిచి పెట్టేందుకు చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ పన్నాగం పన్నారంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా శనివారం సంచలన ఆరోపణలు చేశారు. మరో మూడు రోజు పోలింగ్ ఉన్న తరుణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఇందుకు సంబంధించిన ఒక ఒక ఆడియో రికార్డింగ్‌ను ప్లే చేశారు. "ఖర్గే, అతని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులందరినీ తుడిచిపెడతాను" అనే వార్నింగ్ ఆ ఆడియోలో ఉందని.. ఆ గొంతు కలబురగి జిల్లా చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ దే అని సూర్జేవాలా ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజలు దగ్గరవుతున్నారనే అక్కసుతో.. రాబోయే ఓటమి భయంతో బీజేపీ క్యాండిడేట్ ఈ హెచ్చరికలు చేశాడన్నారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే తో పాటు ఆయన ఫ్యామిలీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. మణికంఠ రాథోడ్.. ప్రధాని మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైలకు చాలా దగ్గరి మనిషి అని ఆయన కామెంట్ చేశారు. " ఇంత జరిగినా ప్రధానమంత్రి మౌనంగా ఉంటారని నాకు తెలుసు. కర్ణాటక పోలీసులు, భారత ఎన్నికల సంఘం కూడా అలాగే ఉంటాయి . కానీ కర్ణాటక ప్రజలు మౌనంగా ఉండరు. తగిన సమాధానం ఇస్తారు" అని సుర్జేవాలా చెప్పారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై విచారణకు హామీ ఇచ్చారు.

"మేము ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటాము. మొత్తం విషయాన్ని విచారిస్తాము. చట్టం ప్రకారం చర్య తీసుకుంటాం " అని వెల్లడించారు. ఇక బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అది ఫేక్ ఆడియో అని.. తనను కించపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని సృష్టించిందని స్పష్టం చేశారు. ఖర్గేకు గానీ, ఆయన కుటుంబానికి గానీ హాని తలపెట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకం తనకు ఉందని తేల్చి చెప్పారు. కాగా, చిత్తాపూర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే గా మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే ఉన్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక్ బరిలోకి దిగారు.

Also Read:

ఉగ్రవాదం గురించి నాకు బాగా తెలుసు: రాహుల్ గాంధీ



Next Story

Most Viewed