మహిళలకు శిశు సంరక్షణ సెలవులు అనేది రాజ్యాంగపరమైన ఆదేశం- సుప్రీంకోర్టు

by Dishanational6 |
మహిళలకు శిశు సంరక్షణ సెలవులు అనేది రాజ్యాంగపరమైన ఆదేశం- సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలకు ఇచ్చే శిశు సంరక్షణ సెలవులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దివ్యాంగ చిన్నారుల పోషణ చూసుకుంటూ ఉద్యోగం చేసే తల్లులకు శిశు సంరక్షణ సెలవులు నిరాకరించలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. సెలవులు ఇవ్వకపోవడం.. ఉద్యోగాల్లో మహిళల సమాన భాగస్వామ్యం ఉండేలన్న రాజ్యాంగ బాధ్యతను ఉల్లఘించడమేనని నొక్కి చెప్పింది. ఈ కేసు తీవ్రమైన అంశాన్ని లేవనెత్తిందని పేర్కొంది. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం హోదా కాదని.. అది రాజ్యాంగ అవసరమని అభిప్రాయపడింది. ఒక ఆదర్శ యజమానిగా ప్రభుత్వం ఈ విషయాన్ని మర్చిపోవద్దని సూచించింది.

సీసీఎల్ విషయమై హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళ వేసిన పిటిషన్ పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా బెంచ్ విచారణ చేపట్టింది. దివ్యాంగులైన పిల్లలున్న మహిళా ఉద్యోగులకు సీసీఎల్ ల మంజూరు విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకొనేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. హిమాచల్ సీఎస్, హిమాచల్ మహిళా శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శులు కూడా కమిటీలో ఉంటారని పేర్కొంది. జూలై 31లోగా సీసీఎల్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వికలాంగుల హక్కుల చట్టానికి అనుగుణంగా ఉండేలా సీసీఎల్‌పై తన విధానాన్ని సవరించాలని హిమాచల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సూచించింది సుప్రీం కోర్టు.ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా ఉండాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని కోరింది.

ఉద్యోగాల్లో మహిళలకు సమాన అవకాశాలను నిరాకరించరాదనే కీలక రాజ్యాంగ బాధ్యతను శిశు సంరక్షణ సెలవు నెరవేరుస్తుందని తెలిపింది కోర్టు. అలాంటి సెలవులను నిరాకరించడం ఉద్యోగం చేసే తల్లి దాన్ని వదులుకొనేలా ఒత్తిడి తెస్తుందని సూచించింది. ప్రత్యేక అవసరాలున్న చిన్నారి కోసం తల్లి ఉద్యోగం చేయడం ఎంతో ముఖ్యమని.. అంతిమంగా పిటిషనర్ వినతి విధానపరమైన అంశాలను లేవనెత్తిందని పేర్కొంది. అయితే ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ పరిరక్షణలకు లోబడి ఉండాలని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.

అంతకుముందు, ఈ కేసులో అక్టోబరు 29, 2021 న పిటిషన్‌పై హిమాచల్ ప్రభుత్వానికి, విద్యాశాఖ డైరెక్టర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ది పర్సన్ విత్ డిజబెలిటీస్ చట్టం కింద కమిషనర్ ను ప్రతిస్పందన కోరింది.

హిమాచల్ ప్రదేశ్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ జియోగ్రఫీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిటిషనర్ పనిచేస్తున్నారు. ఆ మహిళా ఉద్యోగి కుమారుడు జన్యు లోపంతో బాధపడుతుండటంతో పుట్టినప్పటి నుంచి ఆమె ఎన్నో సర్జరీలు చేయించింది. కుమారుడి చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన సీసీఎల్ లను పూర్తిగా వాడుకున్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసస్ రూల్స్ కింద శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని హిమాచల్ ప్రభుత్వాన్ని కోరారు పిటిషనర్. కానీ ఆ అభ్యర్థనను హిమాచల్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో హైకోర్టులోనూ ఆమెకు చుక్కెదురైంది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ కింద సెలవులు వాడుకునేలా ఆదేశాలివ్వాలన్న మహిళ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.



Next Story

Most Viewed