భారంగా మారిన విద్య: బాంబే హైకోర్టు

by Dishanational1 |
భారంగా మారిన విద్య: బాంబే హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ సంస్కృతిలో పవిత్రమైనదిగా పరిగణించబడిన ఒకప్పటి విద్య, ఇప్పుడు భరించలేనిదిగా మారిందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం అలాంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని, మానవాళి అభివృద్ధి సాధించడానికి నాణ్యమైన విద్య అందరికీ చేరేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అని పేర్కొంది. పూణెలో విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతినిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొట్టివేయడానికి నిరాకరించిన న్యాయమూర్తులు ఏఎస్ చందూర్కర్, జితేంద్ర జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. గత నెల 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో విద్యా విధానాల్లో కోర్టు జోక్యం చేసుకోదని, ఉత్తమమైన విద్యాసంస్థలను ఎంచుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని పేర్కొంది.

ఎన్నో దశాబ్దాలు పూణె నగరం 'ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్'గా ప్రసిద్ధి చెందింది. విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ విద్య కోసం రావడం వల్ల పూణె విద్యాసంస్థలకు కేంద్రంగా మారింది. అందుకే పూణెలో విద్యా సంస్థల ఏర్పాటు పోటీగా నెలకొందని కోర్టు వివరించింది. ఈ క్రమంలోనే పవిత్రమైన విద్య కాలం గడిచేకొద్దీ, నగరం అభివృద్ధి చెందుతున్న కారణంగా భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య అందించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని తెలిపింది. కాగా, పూణేలో విద్యాసంస్థల ఏర్పాటుపై తమను కాదని వేరే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని జాగృతి ఫౌండేషన్, సంజయ్ మొదక్ ఎడ్యుకేషన్‌లు పిటిషన్ వేశాయి. దీన్ని కొట్టివేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, అధికార దుర్వినియోగం జరిగినప్పుడే కోర్టు జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేసింది.


Next Story