బీజేపీది అధికార దాహం: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు

by Dishanational2 |
బీజేపీది అధికార దాహం: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీకి తీవ్ర అధికార దాహం ఉందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలే అందుకు నిదర్శనమని తెలిపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఆ పార్టీ దొంగతనం, మోసాలపై ఆధారపడిందని ఆరోపించారు. ఇటువంటి నాయకత్వంలో దేశ భవిష్యత్తు ఆందోళన కరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్‌లో రిగ్గింగ్ చేయడాన్ని, ప్రిసైడింగ్ అధికారి అంగీకరించడం చూస్తే బీజేపీకి ఎంత అధికార దాహం ఉందో తెలుస్తోంది. ఇది చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం. కాషాయపార్టీ వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలి. అంతేగాక ప్రతి చోటా అధికారాన్ని వదులుకోవాలి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా నిర్వీర్యం చేసిన ఈ సిగ్గుమాలిన చర్యకి బీజేపీ మద్దతు దారులు తలవంచాలన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అనుచిత చర్యలకు పాల్పడే అధికారులు కూడా ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారంటూ రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు మందలించిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ పై వ్యాఖ్యలు చేశారు.

చండీగఢ్ మేయర్ ఎన్నికపై నేడు మళ్లీ విచారణ

చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ కోర్టుకు హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. మేయర్ ఎన్నికలకు చెందిన అన్ని బ్యాలెట్ పేపర్లు, వీడియోలను కోర్టు ఢిల్లీకి రప్పించింది. మద్యాహ్నం 2గంటలకు ఎన్నికలకు సంబంధించిన పూర్తి వీడియో, బ్యాలెట్ పేపర్లను కోర్టు పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. బ్యాలెట్‌ పేపర్లలో ట్యాంపరింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై తానే స్వయంగా విచారణ జరుపుతానని సీజేఐ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. దీంతో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.


Next Story