లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తొలి విజయం

by Dishanational1 |
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తొలి విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కనీసం పోలింగ్ వరకు కూడా వెళ్లకుండానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొలి లోక్‌సభ నియోజకవర్గంలో విజయాన్ని దక్కించుకుంది. గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ నియోజకవర్గం ఇందుకు వేదికయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సీటు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. సూరత్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పోలింగ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు ఆయన విజయం సాధించినట్టు జిల్లా కలెక్టర్, ఎలక్షన్ ఆఫీసర్ సౌరభ్ పర్ఘీ తెలిపారు. ఎన్నికల సర్టిఫికేట్‌ను కూడా అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని నామినేషన్‌ను ఎన్నికల అధికారులు రద్దు చేయడంతో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తిరస్కరణకు గురైన వెంటనే మిగిలిన స్వతంత్ర అభ్యర్థులందరూ పోటీ నుంచి తప్పుకోవడం గమనార్హం. దీంతో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంతా గెలుపును సొంతం చేసుకున్నారు. ఇక, ఎన్నికలు ప్రచార దశలోనే తొలి విజయం దక్కడంతో బీజేపీ పార్టీ వర్గాలు విజయోత్సవ సంబరాలు మొదలుపెట్టింది.

నీలేశ్ కుంభాని నామినేషన్ తిరస్కరణ జరిగిన తర్వాత ఎనిమిది మంది ఇతర అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. ఈ వ్యవహారంపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విపక్ష నేతలు విమర్శించారు. దీనిపై స్పందించిన ముఖేశ్ దలాల్ వారి విమర్శల్లో అర్థంలేదన్నారు. నీలేశ్ కుంభాని నామినేషన్ ప్రధానంగా మద్దతుదారుల సంతకాలు చెల్లకపోవడం వల్లనే తిరస్కారానికి గురైంది. ఈ విషయాన్ని బీజేపీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై ఆదివారం విచారణ జరగ్గా, సంతకాలు చేసిన నలుగురిలో ముగ్గురు తాము ఆ సంతకాలు చేయలేదని అఫిడవిట్లు సంపరించారు. అయితే, తమ అభ్యర్థుల మద్దతుదారులను కొందరు కిడ్నాప్ చేసి, భయపెట్టి అఫిడవిట్లు తీసుకున్నారని విపక్ష నేతలు విమర్శలకు దిగారు. నీలేశ్ సైతం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed