ఇది ట్రైలర్ మాత్రమే.. కాంగ్రెస్‌పై అవినీతిపై బీజేపీ స్పెషల్ వీడియో!

by Disha Web Desk 19 |
ఇది ట్రైలర్ మాత్రమే.. కాంగ్రెస్‌పై అవినీతిపై బీజేపీ స్పెషల్ వీడియో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం హయాంలో పాల్పడిన అవినీతిపై బీజేపీ ఆదివారం ‘కాంగ్రెస్ ఫైల్స్’ అంటూ మొదటి ఎపిసోడ్‌ను విడుదల చేసింది. ఈ వీడియో తొలి ఎపిసోడ్‌ను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ మొదటి ఎపిసోడ్, కాంగ్రెస్ పాలనలో ఒకదాని తర్వాత ఒకటి అవినీతి, కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి’ అని బీజేపీ ట్వీట్ చేసింది. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తూ మూడు నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేసింది.

ఈ వీడియో మెసేజ్‌కు ‘కాంగ్రెస్ అంటే అవినీతి’అని తెలిపింది. ప్రస్తుతం విడుదల చేసిన వీడియో ట్రైలర్ మాత్రమేనని..అసలు సినిమా ఇంకా ముందుందని పేర్కొంది. ఈ వీడియోలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యూపీఏ హయాంలో ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. ప్రజల కష్టార్జితం రూ.4. 80 లక్షల కోట్లను కాంగ్రెస్ దోచుకుందని బీజేపీ వీడియోలో ఆరోపించింది. ఈ సొమ్ముతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చునని తెలిపింది. దేశ భద్రత నుంచి అభివృద్ధి వరకు అనేక పథకాలను పూర్తి చేయవచ్చునని పేర్కొంది.

24 ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకలను, 300 రఫేల్ యుద్ధ విమానాలను కొనవచ్చునని, 1,000 మంగళ్ మిషన్స్‌‌ను నిర్వహించవచ్చునని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ అవినీతి వల్ల పడిన భారాన్ని దేశం మోయవలసి వస్తోందని విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ వల్లే అభివృద్ధిలో దేశం వెనుకబడిందని పేర్కొంది. రూ.1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం గురించి కూడా దీనిలో ప్రస్తావించింది.

కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోని చిట్టచివరి పదేళ్లలో జరిగిన అవినీతిని వివరించింది. వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టావెస్ట్‌లాండ్ సీఈఓ రూ.350 కోట్లు ముడుపులు చెల్లించారని...టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణం విలువ రూ.1.76 లక్షల కోట్లు అని ఆరోపించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కుంభకోణం జరిగిందని, కామన్వెల్త్ కుంభకోణం రూ.70 వేల కోట్లు అని, రైల్వే బోర్డు చైర్మన్‌కు ముడుపులు రూ.12 కోట్లు అని వివరించింది. కాంగ్రెస్ అవినీతిలో ఇది చాలా చిన్న భాగం మాత్రమేనని, సినిమా పూర్తి కాలేదని తెలిపింది.



Next Story

Most Viewed