బీజేపీ నియంతృత్వ విధానాలు అవలంభిస్తోంది: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శలు

by Dishanational2 |
బీజేపీ నియంతృత్వ విధానాలు అవలంభిస్తోంది: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నియంతృత్వ విధానాలను అవలంభిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగి ఉండటం ప్రజలను అవమానించడమేనని తెలిపారు. సోమవారం ఆయన పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ సుల్తాన్ బతేరిలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ బీజేపీపై మండిపడ్డారు. ‘దేశంలో ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ భావిస్తోంది. కానీ ఆ విధానం దేశ యువతను అవమానించడమే. దేశంలో ఒకే నాయకుడు మాత్రమే ఎందుకు ఉండాలి’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసాలు, సంస్కృతి, భాష, మతాన్ని గౌరవిస్తుందని తెలిపారు. తనపై ఎల్లప్పుడూ ప్రేమను చూపిస్తున్న వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాహుల్ హెలీకాప్టర్ తనిఖీ

రాహుల్ గాంధీ వయనాడ్‌కు వస్తుండగా..తమిళనాడులోని నీలగిరిలో రాహుల్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. నీలగిరిలో ల్యాండ్ అవ్వగానే సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకు తనిఖీ చేశారనే వివరాలు వెల్లడించలేదు. అంతకుముందు రాహుల్ నీలగిరిలో విద్యార్థులు, కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం వయనాడ్ చేరుకున్నారు. పలు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కాగా, వయాన్ సెగ్మెంట్ నుంచి రాహుల్ మరోసారి ఎంపీగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed