బిగ్ న్యూస్: విపక్షాలను దెబ్బ కొట్టేలా BJP భారీ వ్యూహం.. ఇక రంగంలోకి నేరుగా ప్రధాని మోడీ..!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: విపక్షాలను దెబ్బ కొట్టేలా BJP భారీ వ్యూహం.. ఇక రంగంలోకి నేరుగా ప్రధాని మోడీ..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంతో దూకుడు మీదున్న బీజేపీ 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్న తరుణంలో బీజేపీ అధిష్టానం సైతం మూడోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా రంగంలోకి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన లోక్ సభ స్థానాలను ఎలాగైన కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా పార్టీ పక్కా స్కెచ్ వేసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో గెలవలేని స్థానాలలో ప్రధాని మోడీ చేత భారీ సభలు, లేదా రోడ్ షోలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

ఆ ముగ్గురికి కీలక బాధ్యతలు:

2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ కోల్పోయిన 160 లోక్‌సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చాలా కాలంగా వార్త కథనాలు వినిపిస్తున్నాయి. సమయం దగ్గరపడుతున్న వేళ ఈ స్థానాల్లో పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివ్ చేసేలా కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఈ స్థానాల్లో క్షేత్ర స్థాయిలో నుంచి రిపోర్టులను తెప్పించుకుంటున్న పార్జీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ వ్యూహంలో భాగంగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాలను వేరు వేరు క్లస్టర్లుగా విభజించి.. అందులో ప్రధాని చేత 45 నుంచి 55 మధ్య ర్యాలీలు లేదా బహిరంగ సభలను తలపెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ర్యాలీల సన్నాహాక బాధ్యతలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లకు అప్పగించినట్లు తెలుస్తోంది. తొలి దశలో ఈ 160 స్థానాలపై ప్రచారం పూర్తయిన తర్వాత, దేశంలోని మిగిలిన 383 స్థానాలకు ప్రధాని మోడీతో పాటు పార్టీలోని ఇతర పెద్ద నాయకులకు టాస్క్ ఉండబోతోందని తెలుస్తోంది.

టార్గెట్ అంతా సౌత్ పైనే:

రెండు లోక్ సభ సీట్లతో ప్రయాణం మొదలు పెట్టిన బీజేపీ ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఏకచత్రాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఫుల్ మెజారిటీతో పార్లమెంట్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో జెండా ఎగరవేస్తున్న బీజేపీకి సౌత్ ఇండియా విషయానికి వచ్చే సరికి పట్టు లభించడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల కోసం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ సౌత్ పేరుతో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది.

దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో మొత్తం 129 లోక్ సభ స్థానాలు ఉంటే బీజేపీకి కేవలం 29 మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాబోయే కర్ణాటక, తెలంగాణతో పాటు సౌత్ స్టేట్స్ పై దృష్టి సారించింది. తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్‌ను గద్దే దించేలా బీజేపీ వరుస కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్సెస్ విపక్షాల వ్యూహాలు భవిష్యత్‌లో ఏ విధంగా ఉంటాయో అనేది ఆసక్తిగా మారింది.



Next Story

Most Viewed