అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర పున:ప్రారంభం: రాహుల్‌పై కేసు నమోదు

by Dishanational2 |
అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర పున:ప్రారంభం: రాహుల్‌పై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మంగళవారం అసోంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం తిరిగి యాత్ర బార్ పేట నుంచి బుధవారం ప్రారంభమైంది. యాత్రకు ముందు రాహుల్ ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. అసోం సీఎం హిమంత బిస్వశర్మపై విమర్శలు గుప్పించారు. అసోం సీఎం అన్ని వేళలా ద్వేషాన్ని వ్యాపింపజేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజల భూములను లాక్కుంటున్నాడని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రే అసలు సమస్యగా పరిణమించారన్నారు. ‘కేసులు పెట్టి నన్ను భయపెట్టగలనన్న ఆలోచన బిశ్వ శర్మకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. వీలైనన్ని కేసులు పెట్టండి. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు నన్ను బెదిరించలేవు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, అసోంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్‌కు సెక్యురిటీ కల్పించడంలో అసోం ప్రభుత్వం విపలమైందని ఆరోపించారు. యాత్రలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అసోం ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాహుల్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడినప్పటికీ పోలీసులు ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదని తెలిపారు.

కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు

మంగళవారం జోడో న్యాయ్ యాత్ర గువహటిలోకి రాకుండా బ్యారీకేడ్లు ఏర్పాటు చేయగా కాంగ్రెస్ శ్రేణులు వాటిని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం బిస్వశర్మ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో రాహుల్, కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు కాంగ్రెస్ నాయకులపై అసోం పోలీసులు..హింస, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు.


Next Story