చైనా బార్డర్‌లో పరిస్థితిపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
చైనా బార్డర్‌లో పరిస్థితిపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనాతో పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ, సున్నితంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. సమీప భవిష్యత్తులో చైనాతో సరిహద్దు సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో సైనికపరమైన మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది చైనా, భారత్ సైన్యాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన ప్రాంతాల సంఖ్య తక్కువేనన్నారు. అయినా బలగాల మోహరింపును పెంచుతున్నట్లు మనోజ్ పాండే చెప్పారు. ‘‘చైనాతో సైనికపరమైన, దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. మిగిలిన సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని ఆర్మీ చీఫ్ తెలిపారు. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లో 71 మంది ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చిందన్నారు. ‘‘ఆర్మీలో రెండు బ్యాచ్‌ల అగ్నివీర్‌‌లను మోహరించాం. వారిలో కొందరిని చైనా బార్డర్‌లో, మరికొందరిని పాక్ బార్డర్‌లో రంగంలోకి దింపాం. నాలుగేళ్ల తర్వాత కూడా ఆర్మీలో కొనసాగాలని భావించే అగ్నివీరుల కోసం విధివిధానాలను సిద్ధం చేస్తాం’’ అని మనోజ్ పాండే వివరించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) తయారు చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకులు మే లేదా జూన్ నాటికి ట్రయల్స్‌ కోసం అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.



Next Story

Most Viewed