పాక్‌లో భారత్ వ్యతిరేక మతపెద్ద మర్డర్

by Dishanational4 |
పాక్‌లో భారత్ వ్యతిరేక మతపెద్ద మర్డర్
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులకు బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు పలువురు కరుడుగట్టిన ఉగ్రమూకలు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. వారిని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అనే వివరాలు ఇప్పటికీ బయటికి రాలేదు. తాజాగా ఈ రకమైన మరో ఘటన పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో చోటుచేసుకుంది. భారత్‌ వ్యతిరేక భావజాలాన్ని పాక్ ప్రజల్లో నూరిపోసే మతపెద్ద అల్లామా మసూదుర్ రెహ్మాన్ ఉస్మానీ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం రోజు ఇస్లామాబాద్ శివార్లలోని ఘౌరీ టౌన్ పరిసరాల్లో ఆయనపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు.. అల్లామా మసూదుర్ రెహ్మాన్ డ్రైవర్‌‌పై కూడా ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో మసూదుర్ రెహ్మాన్ చనిపోగా.. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సాక్షాత్తూ దేశ రాజధాని నగరంలోనే ఈ మర్డర్ జరగడంతో పాక్ భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఈ ఘటన వివరాలను స్థానిక పోలీసు శాఖ అధికార ప్రతినిధి టకీ జవాద్ ధృవీకరించారు. ఇప్పటి వరకు ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటన చేయలేదు. హంతకులను గుర్తించడానికిగానూ ఈ మర్డర్ జరిగిన ప్రదేశం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు.

తీవ్రవాద ప్రస్థానంతో..

‘సిపాహీ ఏ సహాబా’ అనే తీవ్రవాద గ్రూపులో అల్లామా మసూదుర్ రెహ్మాన్ ఉస్మానీ పనిచేసేవారు. అయితే ఆ సంస్థపై పాక్ ప్రభుత్వం బ్యాన్ విధించాక.. ఆయన సున్నీ ఉలేమా కౌన్సిల్ అనే సంస్థలో చేరారు. అందులో డిప్యూటీ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. ‘సిపాహీ ఏ సహాబా’ అనే సంస్థకు హింసాత్మక చరిత్ర ఉంది. అది షియా ముస్లింలు లక్ష్యంగా ఎన్నో హింసాత్మక దాడులు చేసింది. వేలాది మంది షియా వర్గం ప్రజల మరణాలకు కారణమైంది. అందువల్లే నిషేధానికి గురైంది.

Next Story