మెయిన్‌పురి ఉపఎన్నికకు డింపుల్ యాదవ్ నామినేషన్

by Disha Web Desk 21 |
మెయిన్‌పురి ఉపఎన్నికకు డింపుల్ యాదవ్ నామినేషన్
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్ పురి లోక్‌సభ ఉపఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేయడం ఖరారైంది. సోమవారం ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రి స్థానం నుంచి డింపుల్ యాదవ్ రికార్డు విజయం సాధిస్తారని అఖిలేష్ అన్నారు. 'నేతాజీకి(ములాయం సింగ్) మెయిన్‌పురితో ప్రత్యేక అనుబంధం ఉంది.

ఈ ప్రాంత ప్రజలు ఆయనను ఆశీర్వదించారు. డింపుల్ యాదవ్‌కు కూడా ప్రజల నుంచి అదే మద్దతు లభిస్తుంది' అని చెప్పారు. ములాయం యాదవ్ పేరుతో తమ పార్టీ రికార్డు స్థాయిలో ఓట్లతో విజయం సాధిస్తామని అన్నారు. నామినేషన్ అనంతరం డింపుల్ యాదవ్ తన మామా ములాయం సింగ్‌ను గుర్తు చేసుకున్నారు. మెయిన్ పురి ప్రజలు ఆశీర్వాదం తనకు ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నామినేషన్‌కు ముందు దంపతులిద్దరు నేతాజీ సమాధిని దర్శించారు. కాగా, ములాయం సింగ్ యాదవ్‌కు మెయిన్‌పురి కంచుకోటగా ఉంది. వరుసగా 5 సార్లు ఆయన ఇక్కడి నుంచే ఎంపీ ఎన్నికయ్యారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆయన మరణించడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో వచ్చే నెల 5న ఉపఎన్నిక నిర్వహించనున్నారు.

Next Story