గుజరాత్ మోడల్‌ను విడిచిపెట్టండి: ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ పిలుపు

by Dishanational2 |
గుజరాత్ మోడల్‌ను విడిచిపెట్టండి: ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలు గుజరాత్ మోడల్ విడిచిపెట్టి ద్రవిడ మోడల్ అనుసరించాలని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) చీఫ్ కమలహాసన్ పిలుపునిచ్చారు. భారత్ ఇకపై ద్రవిడ మోడల్ పాటించాలని తెలిపారు. డీఎంకే దక్షిణ చెన్నయ్ అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్‌కు మద్దతుగా మైలాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్ మోడల్ గొప్పదని ప్రజలు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇప్పుడు భారతదేశం ద్రవిడ నమూనాను అనుసరించాలి’ అని తెలిపారు. మన హక్కులను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. మిత్రపక్షాలు ఐక్యంగా పోరాడి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాయని దీమా వ్యక్తం చేశారు.

కాగా, తమిళనాడులో కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), ఎంఎన్ఎం, విదుతలై చిరుతైగల్ చట్చి(వీసీకే), సీపీఐ, సీపీఎంలు భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19న తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 స్థానాలకు గాను డీఎంకే 20, కాంగ్రెస్ 8, సీపీఐ 2, సీపీఎం, ఐయూఎంఎల్ ఒక్కో సీటులో గెలుపొందాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. డీఎంకే 20 స్థానాల్లో పోటీ చేయగా అన్ని సీట్లలో గెలుపొందింది.



Next Story