బీజేపీకి 32, షిండేకు12: మహారాష్ట్రలో సీట్ షేరింగ్ ఖరారు!

by Dishanational2 |
బీజేపీకి 32, షిండేకు12: మహారాష్ట్రలో సీట్ షేరింగ్ ఖరారు!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమిలు సీట్ షేరింగ్, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో భేటీ అయినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చించగా, ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లకు గాను బీజేపీ 32 స్థానాల్లో పోటీ చేయనుండగా..ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 3 నుంచి నాలుగు సీట్లు కేటాయించినట్టు సమాచారం.

23సీట్లు డిమాండ్ చేస్తున్న షిండే?

శివసేన పేరు, గుర్తులు ప్రస్తుతం సీఎం షిండే వద్ద ఉన్నాయి. 2019లో శివసేన 23సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు కూడా 23 సెగ్మెంట్లు తమకే కేటాయించాలని షిండే పట్టుబడుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇటీవలే ప్రభుత్వంలో చేరిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా 10సీట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. 2019లో అప్పటి శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుతం ఒక ఎంపీ మాత్రమే అజిత్‌తో ఉన్నారు. కాగా, మార్చి 2న లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. అందులో మహారాష్ట్రకు సంబంధించి ఎవరినీ ఖరారు చేయలేదు. తాజాగా సీట్ షేరింగ్ ఓ కొలిక్కి వచ్చినందున త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనుంది.


Next Story

Most Viewed