త్రిపురలో 23 మంది బంగ్లాదేశ్ స్మగ్లర్ల అరెస్టు: 6,250 కిలోల చక్కెర స్వాధీనం

by Dishanational2 |
త్రిపురలో 23 మంది బంగ్లాదేశ్ స్మగ్లర్ల అరెస్టు: 6,250 కిలోల చక్కెర స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: త్రిపుర రాష్ట్రంలోని సమజ్‌గంజ్‌లో 23 మంది బంగ్లాదేశ్ స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారి ఒకరు తెలిపారు. సరిహద్దులో స్మగ్లింగ్ జరుగుతుందని పక్కా సమాచారం మేరకు బీఎస్ఎఫ్ దళాలు.. సమర్ గంజ్ వద్ద దాడులు చేపట్టి 23 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారి నుంచి 125 బ్యాగుల్లో ప్యాక్ చేసిన 6,250కిలోల చక్కెర, 17 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన 23 మందిలో 22 మంది ఫెని జిల్లా వాసులు కాగా, ఒకరు చిట్టగాంగ్‌కు చెందినవారని తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వీరందరినీ పోలీసులకు అప్పగించారు. దాదాపు 30 మంది బంగ్లాదేశ్ స్మగ్లర్లు గ్రూపులుగా విడిపోయి, భారత్ వైపు ఉన్న తమ మద్దతు దారుల నుంచి అక్రమంగా చక్కెర రవాణా చేయడానికి వీరు సరిహద్దులు దాటినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో త్రిపులోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో చక్కెర అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. 2023లో బీఎస్ఎఫ్ 16 మంది సరిహద్దు స్మగ్లర్లను అరెస్టు చేసి 5.49లక్షల కిలోల చక్కెరను, 27 వాహనాలను పట్టుకుంది. అంతేగాక ఏడాది ఇప్పటి వరకు 34 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, 14 వాహనాలను స్వాధీనం చేసుకుంది. స్మగ్లింగ్, సరిహద్దు నేరాలను నియంత్రించడానికి నిరంతరం అప్రమత్తంగా ఉంటామని బీఎస్ఎఫ్ తెలిపింది.


Next Story