16వ ఆర్థిక సంఘం తొలి భేటీ.. చర్చించిన అంశాలివే

by Dishanational4 |
16వ ఆర్థిక సంఘం తొలి భేటీ.. చర్చించిన అంశాలివే
X

దిశ, నేషనల్ బ్యూరో : 16వ ఆర్థిక సంఘం మొదటి సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరిగింది. ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా అధ్యక్షతన జనపథ్‌లో ఉన్న జవహర్ వ్యాపార్ భవన్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం ఛైర్మన్, సభ్యులను 16వ ఆర్థిక సంఘం కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే, ఇతర అధికారులు స్వాగతం పలికారని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సంఘం పనితీరుకు సంబంధించిన నియమ నిబంధనలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, నిపుణులు, ప్రముఖ పరిశోధనా సంస్థలు, ఆర్థిక సమాఖ్యలు సహా వివిధ వర్గాలతో ఆర్థిక సంఘం విస్తృత సంప్రదింపులు జరుపుతుందని ఆర్థికశాఖ పేర్కొంది. కేంద్రంలోని మోడీ సర్కారు 2023 డిసెంబర్ 31న 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఛైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిషన్‌లో కార్యదర్శి (రిత్విక్ రంజనం పాండే), ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ఒక ఆర్థిక సలహాదారు ఉన్నారు. ఇది తన సిఫార్సులను 2025 అక్టోబర్ 31 నాటికి సమర్పించనుంది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఐదేళ్లపాటు ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలుచేయనుంది. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల ఫోకస్ ఇప్పుడు ఆర్థిక సంఘంపైనే ఉంది.

Next Story

Most Viewed