పిక్నిక్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు టీచర్లు, 14 మంది విద్యార్థులు మృతి

by Dishanational5 |
పిక్నిక్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు టీచర్లు, 14 మంది విద్యార్థులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: స్కూల్ తరఫున సరదాగా వెళ్లిన విహార యాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.పిక్నిక్‌కు వెళ్లిన విద్యార్థుల బోటు నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లతో కలిపి మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని వడోదరలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే, ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. తమ విద్యార్థులను స్థానిక వడోదరకు విహార యాత్రకు తీసుకెళ్లింది. అక్కడ హరణి సరస్సులో బోటులో ప్రయాణిస్తుండగా, ఆ బోటు ఒక్కసారిగా మునిగిపోయింది. బోటులో మొత్తం 27 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉండగా, ఏ ఒక్కరూ లైఫ్ జాకెట్ వేసుకోలేదు. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు సహా 16 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న సహాయక సిబ్బంది ఏడుగురిని ప్రాణాలతో కాపాడారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మృతిచెందిన విద్యార్థుల కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, సీఎం భూపేంద్ర పటేల్ సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, గాయపడినవారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తామని వెల్లడించారు. వడోదర ఎమ్మెల్యే శైలేశ్ మెహతా మాట్లాడుతూ, ఈ ప్రమాదానికి బోటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు. సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని బోటులోకి ఎక్కించుకున్నారని తెలిపారు. కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.




Next Story

Most Viewed