జమ్మూ-శ్రీనగర్ లోయలో పడిన కారు.. 10 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

by Disha Web Desk 17 |
జమ్మూ-శ్రీనగర్ లోయలో పడిన కారు.. 10 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో బ్యాటరీ చెష్మా అనే ప్రాంతంలో ఒక ఎస్‌యూవీ కారు అదుపు తప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎస్‌డీఆర్‌ఎఫ్‌), సివిల్‌ క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌(క్యూఆర్టీ) ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతూ, 10 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. కారులో వెళ్తున్న వారిని వలస కార్మికులుగా భావిస్తున్నారు. మృతుల్లో కారు డ్రైవర్, జమ్మూలోని అంబ ఘ్రోతాకు చెందిన బల్వాన్ సింగ్ (47), బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందిన విపిన్ ముఖియా భైరాగాంగ్ అనే వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలుపుతూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.


Next Story

Most Viewed