అంతరిక్షంలో ఆహారం కోసం ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’

by  |
అంతరిక్షంలో ఆహారం కోసం ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’
X

దిశ, ఫీచర్స్ : భూమ్మీదున్న ప్రతి జీవికి ఆహారం తప్పనిసరి. అలానే అంతరిక్షంలో అడుగుపెట్టే ఆస్ట్రోనాట్లకు కూడా ఫుడ్ అవసరమే. ఈ క్రమంలోనే మార్స్ పైకి ఆస్ట్రోనాట్లను పంపించాల‌ని భావిస్తున్న నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ).. వారి కోసం ఆహారానికి సంబంధించిన కొత్త వ్యవ‌స్థలు, టెక్నాల‌జీల‌ను క‌నుగొనేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (సీఎస్ఏ) సహకారంతో ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’ను నిర్వహిస్తోంది. ఇందులో గెలిస్తే.. 500,000 డాలర్ల(సుమారు రూ. 3.62 కోట్లు)ను సొంతం చేసుకోవచ్చు.

మార్స్ పైకి వెళ్లిరావడానికి దాదాపు మూడేళ్ల సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆస్ట్రోనాట్లకు పోషకాహారం కావాలి. అందుకోసం ఇక్కడి నుంచే ఆహారాన్ని తీసుకుపోవడం సాధ్యం కాదు కాబట్టి అంతరిక్షంలోనే ఆహారాన్ని సిద్ధం చేసుకొనే ప్రక్రియపై నాసా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ‘డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్’ను నిర్వహిస్తున్న నాసా.. వ్యోమగాములకు అవసరమయ్యే అధిక పోషకాలున్న ఆహారాన్ని అంతరిక్షంలో సులువుగా వండుకొని తినే పద్ధతులను వివరించాలని కోరుతోంది. ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్లు మే 28 వ‌ర‌కు రిజిస్టర్ చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత జులై 30లోపు త‌మ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్‌‌ వివరాలను నాసాకు పంపించాల్సి ఉంటుంది. టాప్ 20 టీమ్స్‌కు ఒక్కొక్కరికి 25 వేల డాల‌ర్ల చొప్పున మొత్తం 5 ల‌క్షల డాల‌ర్లు ఇస్తారు. అయితే ఈ ఆఫ‌ర్ కేవ‌లం అమెరికాలోని టీమ్స్‌కు మాత్రమే ప‌రిమితం చేయగా, ఇతర దేశాల నుంచి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నవారికి బహుమతి పొందే అవకాశం ఉండదన్నారు. దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీని సందర్శించాలని నాసా తెలిపింది.



Next Story

Most Viewed