జంట హత్యల వెనుక అంత స్టోరీ ఉందా..

by  |
జంట హత్యల వెనుక అంత స్టోరీ ఉందా..
X

దిశ, క్రైమ్ బ్యూరో :
హైదరాబాద్‌ నగరంలో ఈ నెల 5న జరిగిన 4 హత్యలకు సంబంధించిన చిక్కుముడులను సిటీపోలీసులు ఒక్కొక్కటిగా విప్పుతున్నారు. మొదటగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని 8వ తేదీ సోమవారం రిమాండ్ కు తరలించారు.మరల 9వ తేదీ మంగళవారం రెయిన్ బజార్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న మరో హత్యకు సంబంధించిన నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.దీనికి సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ చక్రవర్తి గుమ్మి విలేకరులకు వెల్లడించారు. యాకత్ పురా లోని చంద్రనగర్‌లో నివాసముండే హబీబ్ ఉన్నిసాకు మహ్మద్ గాలిబ్ ఖాన్‌తో వివాహం కాగా, వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే, హబీబ్ ఉన్నిసా భర్త యాకత్ పురాలోని ముర్తుజా చమాన్ కు చెందిన మరో మహిళ రుక్సానాను రెండో పెండ్లి చేసుకున్నాడు.ఈమెకు కూడా ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గాలిబ్ ఖాన్ మరణానంతరం మొదటి భార్య హబీబ్ ఉన్నిసా పెద్ద కుమారుడు ఖాలీద్ ఖాన్ కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందాడు. అప్పట్నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉద్యోగం, ఆస్తులకు సంబంధించిన వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే గాలిబ్ ఖాన్ రెండో భార్య రుక్సానా కుమారులు మొదటి భార్య కుటుంబంపై పగ పెంచుకుని..ఆమె కుమారులలో ఒకరిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న సాయంత్రం హబీబ్ ఉన్నిసా రెండో కుమారుడు ఇమ్రాన్ ఖాన్ మొబైల్ రీఛార్జ్ కోసం జాఫర్ రోడ్డు వద్దకు రాగానే కత్తితో దాడి చేసి హత్యచేశారు.ఈ ఘటనపై మృతుని తల్లి హబీబ్ ఉన్నిసా రెయిన్ బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రెయిన్ బజార్ పోలీసుల సహాయంతో విచారణ చేపట్టిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం రెయిన్ బజార్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో మెహతాబ్, తాలేబ్, అర్భజ్, అమీర్‌లను పోలీసులు అరెస్టు చేయగా, మహ్మద్ గౌస్ ఖాన్ పరారీలో ఉన్నాడు. వీరి నుంచి మూడు కత్తులు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు మిస్టరీని త్వరగా చేధించిన సౌత్‌జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, ఎస్ఐలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ తాఖీద్దీన్ ఇతర సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి అభినందించారు.

Next Story

Most Viewed