‘మా నాన్న ఒక రైతు’.. ఆకట్టుకుంటున్న షాప్ పేరు

by  |
‘మా నాన్న ఒక రైతు’.. ఆకట్టుకుంటున్న షాప్ పేరు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ప్రస్తుత రోజుల్లో ఏ మూలన ఏమి జరిగినా ఇట్టే సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఈ తరుణంలో ప్రస్తుత రోజుల్లో నేటి యువత వెరైటీగా ఉన్న వాటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే వ్యాపార రంగంలో వారు కూడా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా వ్యాపార సంస్థలకు వివిధ పేర్లను పెడుతూ ఆకర్షిస్తున్నారు. వీటితోపాటు కొనుగోలుదారులను బాగా ఆకట్టుకునేందుకు పలు ఆఫర్స్ ను ప్రకటిస్తూ వారి వ్యాపార సంస్థలను మెరుగుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఏర్పాటు చేసిన ఓ కూరగాయల షాపు పేరు చాలా బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ కూరగాయల పేరు ఏంటో అని అనుకుంటున్నారా.?! అదేనండి” మా నాన్న ఒక రైతు”..వినడానికి వింతగా ఉన్నా కూరగాయల షాపు పేరు ఇదే. ఇంతకీ ఈ కూరగాయల షాపు ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.?! గ్రేటర్ హైదరాబాద్ లోని పాత బోయిన్ పల్లిలో ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేశారు. కూరగాయల దుకాణం పేరు వినడానికి కాస్త ఆకర్షించే విధంగా ఉన్నా కానీ.. ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి చేరుకొని చివరకు సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారింది.

అంకురార్పణ ఇలా..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మునిగడప గ్రామానికి చెందిన సోమయ్యకు 6 ఎకరాల స్థలం ఉంది. అతని కుమారుడు కనకరాజు 14 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ నష్టాల్లో ఉంది. నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పండ్లు, కిరాణ సరుకులకు గిరాకి ఏర్పడింది. దీంతో కనకరాజు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తన పొలంలో పండించిన తాజా కూరగాయలను ఏ రోజుకారోజు ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ అమ్మితే మంచి గిట్టు బాటు ధర లభిస్తుందని భావించాడు. తన నాన్న సోమయ్యతో ఈ విషయమై చర్చించాడు. తల్లిదండ్రులు నీ ఆలోచన బాగుంది.. మేము ఇక్కడ కూరగాయలను పండిస్తాం. నీవు నగరంలో విక్రయించాలని సూచించారు. దీంతో గత ఆరు నెలల క్రితం తన భూమిలోనే కూరగాయల సాగును ప్రారంభించారు.

మా నాన్న ఒక రైతు పేరిట ..

కనకరాజు ‘ మా నాన్న ఒక రైతు’ పేరిట పాత బోయిన్ పల్లిలోని హెచ్ఈఎల్ కాలనీలో కూరగాయల దుకాణాన్ని తెరిచాడు. పేరు చదువగానే కస్టమర్లు ఆశ్చ్యర్యానికి లోనవుతున్నారు. కాగా దుకాణ యాజమాని కనకరాజు రోజు తెల్లవారు జామునే తన స్వగ్రామానికి వెళ్లి, అక్కడ తన తల్లిదండ్రులు, కూలీలు తెంపిన తాజా కూరగాయాలను ఉదయాన్నే తెస్తుంటాడు. కూరగాయలను తెచ్చేందుకు ట్రాన్స్ ఫోర్ట్ కోసం కరోనా వల్ల ఇంటి వద్దనే ఖాళీగా ఉన్న తన సొంత ఆటో ట్రాలీనే వినియోగిస్తున్నాడు. తెచ్చిన కూరగాయలను తన భార్య, పిల్లలు విక్రయిస్తుంటారు. పరిసర ప్రాంతంలో ఎన్ని కూరగాయల దుకాణాలున్నా.. ‘మా నాన్న ఒక రైతు’ పేరిట ఏర్పాటు చేసిన షాపు ట్రెండ్ గా నిలుస్తోంది. ఆ పేరు వల్ల కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మా నాన్న ఒక రైతు పేరుతోనే కొనుగోలుదారుల్లో ఓ నమ్మకాన్ని క్రియేట్ చేసినట్లు కనకరాజు చేబుతున్నారు. ఈరోజు తన పొలంలో కోసిన/తెంపిన కూరగాయలు, ఆకుకూరలను వినియోగదారులకు అందించడం వల్ల కస్టమర్ల అభిమానాన్ని పొందుతున్నానని,దీంతో గిరాకీ కూడా బాగానే ఉందని చెబుతున్నాడు. రోటీన్ పేర్లు వ్యాపార సంస్థలకు పెడితే త్వరగా ప్రజల్లోకి వెళ్లలేమని, కొత్తదనంతో ఆలోచిస్తే.. పబ్లీసిటి దానంతట అదే వస్తుందని..ఈ కూరగాయల షాపును భట్టి ఇట్టే తెలుస్తోంది.

తాజా కూరగాయలను అందిస్తా.. కనకరాజు

నగర ప్రజలకు తాజా కూరగాయాలను అందించాలన్నదే తన లక్ష్యం. నగర మార్కెట్లకు వచ్చే కూరగాయలు వందల కిలోమీటర్ల నుంచి వస్తుంటాయి. రోజుల తరబడి పెట్టెలలో ఉండడం వల్ల ఆశీంచిన పోషకాలు ఉండవు. దీంతో నగరవాసులు శివారు ప్రాంతాలలోని గ్రామాల్లో విక్రయించే కూరగాయలను కొనేందుకు ఇష్టపడుతారు. దీంతో తానే ఓ షాపును ఏర్పాటు చేసి తాజా కూరగాయలను విక్రయిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయని భావించాను. ఆకుకూరలు, కూరగాయలు ఏప్పటికప్పుడు తాజావి తెవడం వల్ల కస్టమర్లు సైతం ఫిదా అవుతున్నారు.



Next Story

Most Viewed