నా కూతురును భయపెట్టారు.. అందుకే బయటకు వచ్చాను

by  |
Pattabhi-Arrest1
X

దిశ, ఏపీ బ్యూరో: నేను మాట్లాడిన మాటలకు లేని అర్థాలను సృష్టించారు. నేను ఇంట్లో లేని సమయంలో ఇంటిపై దాడి చేశారు. నా ఎనిమిదేళ్ల ఏకైక కుమార్తెను కూడా భయకంపితురాలిని చేశారు. ఇది అత్యంత అమానవీయమైన చర్య. పసి వయసులో హృదయాలకు గాయం తగిలితే దాన్ని పోగొట్టడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. మానవత్వం లేకుండా ప్రవర్తించి తన చిన్నారి కుమార్తెను షాక్‌కు గురి చేశారు. ఇది చాలా దుర్మార్గమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడితో తన కూతరు తీవ్ర మనోవేదనకు గురయిందని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కుటుంబాన్ని తీసుకుని బయటకు వచ్చినట్లు వెల్లడించారు.

తన కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. మనోవేదనకు గురైన కుమార్తెను, భార్యను బయటకు తీసుకొస్తే దానికి కూడా విపరీతార్థాలు తీస్తున్నారు. ఇది ప్రేరేపిత ఉగ్రవాదం కాకపోతే ఇంకేంటని పట్టాభి ప్రశ్నించారు. తన ఇంటిపై మూడోసారి దాడి చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అతి త్వరలోనే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని వాటిని కోర్టుల్లోనే తేల్చుకుంటానని చెప్పుకొచ్చారు. కుట్రపూరితమైన ఈ కేసులకు భయపడే పరిస్థితే లేదని స్పష్టం చేశారు.

ఏపీ గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ దాడుల నేపథ్యంలో తనకు.. తన కుటుంబానికి అండగా నిలిచిన చంద్రబాబు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని దాడులు చేసినా విద్యార్థుల భవిష్యత్ కోసం తన పోరాటం చేసి తీరుతానని పట్టాభి ఆ వీడియోలో వెల్లడించారు.



Next Story

Most Viewed