గర్భం దాల్చిన మైనర్.. చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం..!

by  |
baby death
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలోని చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం బయటపడింది. ఉదయం పారిశుధ్య సిబ్బంది చెత్త తొలగించేందుకు స్థానిక హోప్ ఆసుపత్రి వద్ద ఉన్న పాయింట్ సమీపంలో చెత్త తొలగిస్తుండగా.. అప్పుడే పుట్టిన శిశువు మృతదేహాన్ని వారు గుర్తించారు. మురికి కాలువ పక్కనే ఉన్న చెత్త కుప్పలో శిశువును చూసి సానిటరీ ఇన్‌స్పెక్టర్ నటరాజ్ గౌడ్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని స్థానిక హోప్ ఆసుపత్రిలో వాకబు చేశారు. శుక్రవారం రాత్రి ఒక విద్యార్థిని కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరినట్టు, శిశువును కన్న తర్వాత ఆమెనే అక్కడ పడేసినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సదరు మైనర్ తల్లిదండ్రులను విచారించగా వారు కూడా నిజం అంగీకరించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక అవాంచిత గర్భం తొలగించుకోలేక రాత్రి జిల్లా ఆసుపత్రిలో కడుపునొప్పి అని చేరింది. అక్కడ డెలివరీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేట్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం అయినట్టు సమాచారం. అయితే, ఆ శిశువు పుట్టిన వెంటనే మరణించినట్టు తెలిసింది. అవాంచిత గర్భం ద్వారా తనకు చెడ్డ పేరు వస్తుందని భావించిన ఆ విద్యార్థిని.. శిశువును చెత్త కుప్పలో పడేసి కడుపునొప్పి అని హోప్ ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది స్థానిక 1వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మైనర్ బోధన్ డివిజన్‌లోని ఎడపల్లి మండలంలో ఒక గ్రామం అని తెలుస్తోంది.

Next Story