వరుణుడిపై ఆడబిడ్డల ఆగ్రహం.. బతుకమ్మను ముచ్చటగా పేర్చి బావిలోకి చేర్చి!

by  |
వరుణుడిపై ఆడబిడ్డల ఆగ్రహం.. బతుకమ్మను ముచ్చటగా పేర్చి బావిలోకి చేర్చి!
X

దిశ, ఖానాపూర్ : రాష్ట్ర పండుగ బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని ఆ పట్టణ వాసులు భావించారు. పొద్దున్నే వెళ్లి తిరొక్కపూలు తెచ్చి ముచ్చటగా బతుకమ్మను పేర్చారు. తీరా సాయంత్రం బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించుకోవాలని అనుకోగా.. వారి ఆశలకు వరుణుడు గండికొట్టాడు. ఎంతకూ వర్షం తగ్గకపోవడంతో తీరా బతుకమ్మ ఆడకుండానే తీసుకెళ్లి బావిలో నిమజ్జనం చేశారు. ఈ వింత ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. బతుకమ్మ పండుగ ఆనందంగా జరుపుకునేందుకు ఉదయం నుంచి ఖానాపూర్ పట్టణంలోని ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. గునుగు పువ్వు, తంగేడు పువ్వు తీసుకొచ్చి నిష్టగా బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ వేడుకలు జరుపుకుందామనుకునే లోపే సాయంత్రం నుంచి ఖానాపూర్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆడబిడ్డలంతా ఇంటికే పరిమితమయ్యారు. తమ శ్రమంతా వృథా అయిపోయిందని మహిళలు ఎంతో బాధపడినట్టు తెలుస్తోంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే బతుకమ్మ పండుగను జరుపుకోలేకపోయామని తెగ ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. దీంతో బతుకమ్మ పండుగను వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, వీడీసీ సభ్యులు తెలిపారు.


Next Story