పెండ్లికొచ్చి ఇరుక్కుపోయి..!

by  |
పెండ్లికొచ్చి ఇరుక్కుపోయి..!
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ మానవాళికి కొరకరాని కొయ్యగా మారింది. వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గుతూ.. ఒక్కసారిగా తన పంజా విసురుతోంది. ఇక కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మూలాన తలెత్తుతున్న సమస్యలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. రకరకాల పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన అనేక మంది.. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఓ పెండ్లికి హాజరయ్యేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులు, బంధువులు 40 రోజులుగా వరుడి ఇంట్లోనే చిక్కుకోవాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి..

ముంబయిలోని అందేరి ప్రాంతానికి చెందిన ఓ యువతికి నగరంలోని పార్శిగుట్టకు చెందిన యువకుడితో మార్చి 19న హైదరాబాద్‌లో వివాహం జరిగింది. ఈ వివాహానికి ముంబయి నుంచి 20 మంది కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివాహం అనంతరం మార్చి 23న వీరంతా తిరుగు ప్రయాణం చేయాల్సి ఉండటంతో అందుకు కావాల్సిన ట్రైన్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు. సరిగ్గా అదేరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇక అప్పటి నుంచి వారు ఇక్కడే చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ కూడా దశల వారీగా ఇప్పటికే మూడుసార్లు ఎక్స్‌టెండ్ అయినందున, వీళ్ళ ప్రయాణమూ మూడుసార్లు వాయిదా పడింది.

ఇదిలా ఉండగా, పెండ్లికి వచ్చిన 20 మంది ఒకే ఇంట్లో ఉండడం సాధ్యం కాకపోవడంతో వీరికోసం వరుడి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వేరే ఇంటిని అద్దెకు తీసుకుని అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. కాగా, ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులను సంప్రదించగా ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకుంటే అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రైవేటు వాహనాన్ని మాట్లాడగా కిరాయి లక్ష రూపాయలు అడిగినట్టు బాధితులు నర్సింగరావు, శోభ చెప్పారు. అయితే, ప్రభుత్వం వలస కూలీలను ప్రత్యేక రైల్లో తరలిస్తున్నట్టుగానే తమను కూడా తరలించాలని వారు కోరుతున్నారు.

Tags : Mumbai, Hyderabad, Marriage, Lock down, special train



Next Story

Most Viewed