Mukesh Ambani : రిలయన్స్ సంస్థ నుంచి తక్కువ ధరలో కరోనా ఔషధం

by  |
Mukesh Ambani : రిలయన్స్ సంస్థ నుంచి తక్కువ ధరలో కరోనా ఔషధం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. సెకెండ్ వేవ్ కారణంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొవిడ్-19 చికిత్స కోసం కొత్త ఔషధాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, తక్కువ ధరలో కరోనా టెస్టింగ్ కిట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. కరోనాను నియంత్రించేందుకు టేప్‌వార్మ్ డ్రగ్ ఔషధం నిక్లోసామైడ్‌ను తీసుకురానున్నట్టు చెప్పారు. అదేవిధంగా రిలయన్స్ సంస్థ తయారు చేసిన డయాగ్నస్టిక్ కిట్‌లు ఆర్ గ్రీన్, ఆర్ గ్రీన్ ప్రో్‌లకు ఐసీఎంఆర్ అనుమతి లభించిందన్నారు.

వీటితో పాటు అతి తక్కువ ధరలో శానిటైజర్లను తయారుచేసే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఇవి ప్రస్తుతం మార్కెట్లో లభించే వాటి ధర కంటే ఐదో వంతు తక్కువని పేర్కొన్నారు. దేశీయంగా చాలా ఆసుపత్రులలో ఉన్న వెంటిలేటర్ల కొరతను తీర్చేందుకు మరింత కృషి చేస్తున్నట్టు రిలయన్స్ సంస్థ వెల్లడించింది. కాగా, కరోనా నియంత్రణకు గతేడాది నుంచే రిలయన్స్ సంస్థ పలు చర్యలను అమలు చేసింది. సంస్థ ఫ్రంట్ లైన్ కార్యకర్తల కోసం పీపీఈ కిట్‌లను తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అలాగే, పీఎం కేర్స్ నిధికి రూ.500 కోట్లను, గుజరాత్, మహారాష్ట్రలకు రూ. కోటి విరాళాన్ని అందజేసింది.


Next Story