ఎమ్మార్వోతో రహస్య మంతనాలు.. ఆ ఎంపీకి అక్కడేం పని?

by  |
ఎమ్మార్వోతో రహస్య మంతనాలు.. ఆ ఎంపీకి అక్కడేం పని?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కొందరు ప్రజాప్రతినిధులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూ వివాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అత్యంత ఖరీదైన ప్రాంతాలపైనే రాష్ట్ర వ్యాప్త ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరు పైరవీలు చేస్తున్నారని సమాచారం. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎంపీ రంగారెడ్డి జిల్లా గండిపేట తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తన మందీ మార్బాలాన్ని ప్రదర్శించారు. రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల కోసం స్లాట్లు బుక్ చేసుకున్న వారంతా కార్యాలయంలో తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సదరు ఎంపీ సరాసరి తహశీల్దార్ గదిలో కూర్చున్నారు. ఏదో 10, 20 నిమిషాలు కాదు. ఏకంగా 2 గంటల పాటు రహస్య మంతనాలు జరిపారు. దీంతో పదుల సంఖ్యలో దరఖాస్తుదారులు ఆ రెండు గంటల పాటు ఎంపీ ఎప్పుడు బయటికొస్తారోనని చూశారు.

ఎంపీ వెళ్లేటప్పుడు కూడా తహశీల్దార్ సాగనంపడానికి వెళ్లి మరో పది నిమిషాలు అందరినీ కూర్చోబెట్టారు. ఒకరిద్దరు తమకు లేట్ అవుతుందని సిబ్బందిని అడిగారు. సిబ్బంది కూడా తహశీల్దార్ చెవిలో పలుమార్లు ఊదారు. ఐనా సదరు ఎంపీ మాత్రం కదలకుండా కూర్చోవడం పట్ల చర్చించుకున్నారు. సామాన్యులెవరినైనా భూ సమస్యలకు ధరణి పోర్టల్ లోనే దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. కానీ ప్రజాప్రతినిధి మాత్రం నేరుగా వచ్చి తహశీల్దార్‌తో పని చేయించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భూములు కలిగిన గండిపేట మండల తహశీల్దార్ కార్యాలయంలో స్థానికేతర ఎంపీకి ఇంకేం పని ఉంటుంది? అంటూ అందరూ గుసగుసలాడారు. ఎకరా రూ.50 కోట్లు పలికే భూములను కొనుగోలు చేశారా? ఏదైనా పైరవీ కోసమే వచ్చారా? రెండు గంటల్లో రూ.కోట్లు విలువజేసే భూమిపై క్లారిటీని తీసుకొని వెళ్లారా? అన్న ప్రశ్నల వర్షం కురిసింది. తమకైతే ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడానికి ఏండ్లు పడుతుంది. మరి ఎంపీకి తహశీల్దార్ గంటల్లోనే ఏం పని చేసి పెట్టారని పలువురు సందేహం వ్యక్తం చేశారు.

Read More: మావోయిస్టు నేతకు కరోనా.. ఆన్‌లైన్‌లో చూసి అడవిలో వైద్యం

Next Story

Most Viewed