ప్రముఖ నటుడు కన్నుమూత.. సీఎం, గవవర్నర్ సంతాపం

by Disha Web Desk 2 |
ప్రముఖ నటుడు కన్నుమూత.. సీఎం, గవవర్నర్ సంతాపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ తమిళ కమేడియన్ మయిల్‌సామి కన్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న 57 ఏళ్ల మయిల్‌ స్వామి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న మైల్‌ స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయ‌న చ‌నిపోయార‌ని చెప్పారు.

మయిల్‌ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయిల్‌ స్వామి 1984లో ధవని కనవుగల్‌ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే తనదైన కామెడీతో అందరికీ ఆకట్టుకున్నాడు. ఎన్నో చిత్రాల్లో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో సుమారు 200 చిత్రాలకుపైగా నటించాడు. గతేడాది వచ్చిన ది లెజెండ్‌ సినిమాలోనూ మయిల్‌స్వామి మంచి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

గవర్నర్ తమిళిసై, సీఎం స్టాలిన్ సంతాపం..

మయిల్ సామి మృతిపట్ల తమిళ సినీ నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా మయిల్ సామి మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని బాధపడినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా ఆయన అన్ని పార్టీలతో స్నేహం కొనసాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విరుగంపాక్కం ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన హాస్యంతో ప్రజల హృదయాల్లోకి నిలిచిపోయిన ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా మయిల్ సామి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మయిల్ సామి మృతిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed