ఏ జీవిగా జన్మించినా.. నవ్వించే వరమివ్వమని దేవుణ్ణి కోరుకుంటా: బ్రహ్మానందం

by Disha Web Desk 7 |
ఏ జీవిగా జన్మించినా.. నవ్వించే వరమివ్వమని దేవుణ్ణి కోరుకుంటా: బ్రహ్మానందం
X

దిశ, సినిమా : 2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎఫ్‌.ఎన్‌.సి.సి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విచ్చేశారు. తొలుత ఎఫ్‌.ఎన్‌.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సెక్రటరీ ముళ్లపూడి మోహన్, కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు.

అనంతరం నటరాజ్‌ మాస్టర్‌ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు, వివిధ తెలుగు పండుగలను తెలియజేస్తూ చేసిన ప్రత్యేక నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వినోద్‌బాబు ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. అలాగే బ్రహ్మానందంగారి జీవితానికి సంబంధించి పలు వివరాలతో కూడిన ఏవీని ప్రదర్శించారు. పద్మశ్రీ, గిన్సీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ గ్రహీత, డాక్టర్‌ బ్రహ్మానందంగారిని శాలువా, గజమాలతో సత్కరించి, ఆయనకు కలియుగదైవం వేంకటేశ్వరుని ప్రతిమ, సన్మానపత్రం అందజేశారు. నటుడు ఉత్తేజ్‌ బ్రహ్మానందంగారి సన్మానం కోసం తాను రాసిన అద్భుతమైన సన్మాన పత్రం చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఎఫ్‌.ఎన్‌.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ‘ఈ ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఇదే సందర్భంలో పద్మశ్రీ బ్రహ్మానందంగారిని సత్కరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నా. ఆయనకు 1250కి పైగా చిత్రాల్లో నటించి కోట్లమందిని నవ్వించే భాగ్యం దక్కడం భగవంతుని వరం. ఇలాగే మరిన్ని సత్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నా. మా కమిటీ సభ్యులు, సబ్‌ కమిటీల్లోని సభ్యులందరూ ఇది మన స్వంత కార్యక్రమం అన్నట్టుగా భావించి పనిచేయడం వల్లే ఇంత మంచి కార్యక్రమం చేయడం సాధ్యమైంది.

30 సంవత్సరాలుగా ఈ క్లబ్‌ను ఈ స్థాయికి తీసుకురావడానికి చాలామంది పెద్దలు ఎంతో కష్టపడ్డారు. హైదరాబాద్‌ నగరంలో అనేక క్లబ్‌లు ఉన్నప్పటికీ మన ఎఫ్‌.ఎన్‌.సి.సి. చేస్తున్న కార్యక్రమాలు మిగిలిన క్లబ్‌లకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషించదగ్గ పరిణామం. చాముండిగారు స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌లో చాలా కీ రోల్‌ పోషిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నాం. ప్రతి పండుగలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం’ అన్నారు.

తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ.. ‘గిన్నీస్‌బుక్‌ రికార్డు సాధించి, కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బ్రహ్మానందంగారు మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవారు కావడం మనందరికీ గర్వకారణం. కళకు, కళాకారులకు భాష, ప్రాంతం, కులం, మతం ఉండవు. 1250 సినిమాల్లో నటించిన బ్రహ్మానందంగారు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారతదేశం గర్వించదగ్గ నటులు. ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో ఆయనకు జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు పరిశ్రమకు ఎప్పుడు ఏం కావాలన్నా.. చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది’ అన్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా బ్రహ్మానందంగారితో పర్సనల్‌గా గడిపే సమయం దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు.. ఆయన కూడా ఎప్పుడూ నవ్వుతూనే బతుకుతుంటారు. నవ్వు ఆయన జీవన విధానం అయిపోయింది. మనం ఏదైనా చెబితే విననట్టే ఉంటారు. కానీ మనం ఆ సీన్‌ చెప్పిన మరుక్షణం నుంచి ఆయన అందులో పరకాయప్రవేశం చేసి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్‌ను తనలోని నటుడి దగ్గరకు లాక్కుంటారు.

మనకు భౌతికంగా కనిపించే బ్రహ్మానందం వేరు.. మానసికంగా శిఖరాగ్రానికి చేరిన బ్రహ్మానందం వేరు. చాలా లోతైన వ్యక్తి. ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి. మానసికంగా ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి ఈ కమెడియన్‌ పాత్రను పోషిస్తున్నారు. చాలా ఆధ్యాత్మికత, అంతే వాస్తవికతల మధ్యలో ఉండే సంఘర్షణలో బతికే మేధావి బ్రహ్మానందంగారు. ‘రంగమార్తాండ’లో ఆయన పాత్రే.. ఆయన నిజ జీవితం. మనందరి నవ్వులు ఒక్క సంవత్సరం కింద లెక్కేస్తే.. కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతాయి. ఆయన అన్ని సంవత్సరాలూ జీవించాలని, మనల్ని నవ్విస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు.

సన్మాన గ్రహీత హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘ఈరోజు నాకు జరిగిన సన్మానం చూస్తుంటే ‘హృదయం మొత్తం సంతోషంతో నిండిపోతే.. నోరు మూగబోతుంది’ అనే సామెత గుర్తుకు వస్తోంది. ఒక కళాకారుడు రంగస్థలంపై ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అంతకుమించిన దుర్మార్గం ఇంకోకటి ఉండదు. నాకు జరిగిన ఈ సన్మానం నా జీవితంలో మర్చిపోలేనిది అని ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఇంత భారీగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను ఊహించలేదు. మన పండగల పూర్వాపరాలు, హిందువుల సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ కళారుకారులు చేసిన నృత్యాలు అద్భుతం.

ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందరూ మోక్షం కోరుకుంటారు. అంటే జన్మరాహిత్యం.. మరో జన్మ ఉండ కూడదు అని. కానీ నేను దేవుణ్ణి మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలని.. ఆ జన్మల్లో నేను ఏ జీవిగా పుట్టినా సరే నా తోటి జీవులను నవ్వించే వరం ప్రసాదించమని కోరుకుంటాను. ఉత్తేజ్‌ రాసిన సన్మానపత్రం చాలా గంభీరంగా ఉంది. నా హృదయాన్ని తాకింది. ఇంతమంది మహామహుల మధ్య గడిపిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తు. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అన్నారు.

ఇక హైపర్ ఆదితో పాటు పలువురు ప్రసంగించిన ఈ కార్యక్రమంలో యాంకర్‌ బాధ్యతల్ని ఉదయభాను నిర్వహించింది. బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు తాను జీవన్మరణ సమస్యలలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నైతికంగా స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంకా తుమ్మల రంగారావు, ముళ్లపూడి మోహన్‌, పి. రాజశేఖరరెడ్డి, కాజా సూర్యనారాయణ, వి.వి.ఎస్‌.ఎస్‌. పెద్దిరాజు, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీమోహనరావు, శ్రీమతి శైలజ జుజాల, బాలరాజ్‌, ఎ.గోపాల్‌రావు, ఏడిద రాజా, వడ్లపట్ల మోహన్‌, సామా ఇంద్రపాల్‌రెడ్డి, సి.హెచ్‌. వరప్రసాదరావు, సురేష్‌ కొండేటి, వై.వి.యస్‌. చౌదరి, వేణురాజు, చాముండేశ్వరీనాథ్‌, ప్రణీత్‌ గ్రూప్‌ చైర్మన్‌ నరేంద్ర, రాహుల్‌ సిప్లిగంజ్‌, నటుడు కృష్ణుడు, శివారెడ్డి, డా॥ కె.వి.ఆర్‌, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ బసిరెడ్డి, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, నటి రాగిణి, వందేమాతరం శ్రీనివాస్‌ ఎఫ్ ఎన్.సి.సి పర్చేజ్ కమిటీ చైర్మన్ శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read..

నాకు అభద్రతాభావం ఎక్కువ.. సినిమాల్లోకి రావాలంటే భయమేసింది

Next Story

Most Viewed