అనుమానపు భర్త.. కూతురుని చంపుకున్న తల్లి

by  |

దిశ, వెబ్ డెస్క్: దంపతుల మధ్య గొడవలకు నాలుగేండ్ల చిన్నారీ బలయ్యింది. కన్నతల్లే పాపను బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.స్థానికుల కథనం ప్రకారం…బంక శ్రీను, మహాలక్ష్మికి తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దంపతులిద్దరికీ తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట భార్య మహాలక్ష్మిని పుట్టింటికి పంపించి.. పెద్ద కూతురుతో కలిసి శ్రీను ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే భార్యను అత్తగారింట్లో కలిశాడు.

పుట్టింట్లో ఉంటున్న మహాలక్ష్మి గర్భం దాల్చి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడా పాప వయసు నాలుగేళ్లు. పేరు రమ్య. అప్పటి నుంచి భార్యపై శ్రీను అనుమానం పెంచుకున్నాడు. ఆ పాప తనకు పుట్టలేదని పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. నాటి నుంచి భార్య పుట్టింటి వద్దే ఉంటోంది . పదిరోజుల కిందట పెద్దల సమక్షంలో పంచాయితీ జరగగా, మహాలక్ష్మి చిన్నకూతురు రమ్యను తీసుకొని తాళ్లవలసలోని భర్త వద్దకు వచ్చింది. ఐతే రమ్య తనకు పుట్టలేదని.. ఆ పాపను వదిలించుకోవాలంటూ భార్యపై శ్రీను ఒత్తిడి తెచ్చాడు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహాలక్ష్మి ఆదివారం తెల్లవారు జామున పాపను తీసుకొని తమ పొలంలోని బావి వద్దకు వెళ్లింది. కూతురిని చంపేసి ఆ తర్వాత తానూ చనిపోవాలనుకుంది. పాపను బావిలో పడేసిన తర్వాత.. చిన్నారి ఆర్తనాదాలు విని భయపడిపోయింది. తన ఆత్మహత్య నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ఐతే పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు తమ పొలంలోనే బావిలో చిన్నారి మృతదేహం కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఒత్తిడి వలన కూతురిని తానే చంపేసినట్లు మహాలక్ష్మీ విచారణలో అంగీకరించింది.



Next Story

Most Viewed