మోడీ వాడే ఆయుధమేంటో తెలుసా..?

by  |
మోడీ వాడే ఆయుధమేంటో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి, మౌలిక విషయాలు, ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రగతి.. ఇవే కాకుండా కేవలం ఎమోషనల్ ప్రసంగాలు, చర్యలు కూడా పార్టీలకు రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టడంలో ఉపయోగపడుతాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి ఎమోషన్‌ను అద్భుతంగా ఆవిష్కరిస్తే చాలు.. అంతావారికి అనుకూలమే అవుతుందని అంటున్నారు. అందుకు ఉదాహరణే ప్రధాని మోడీ అని చెబుతున్నారు. ఎందుకంటే, మొదలు అభివృద్ధి ఎజెండాతో ‘వికాస్ పురుష్’గా, గుజరాత్ అభివృద్ధి నమూనాతో 2014 సాధారాణ ఎన్నికల్లో విజయం సాధించిన మోడీ, 2019లో మాత్రం భావోద్వేగాలతోనే విజయం సాధించారని విశ్లేషిస్తున్నారు. ఆ ఎన్నికల్లో తన ఐదేండ్ల పాలనా విషయాలు చెప్పడం కంటే పుల్వామా, బాలాకోట్ దాడుల ప్రస్తావన, జాతీయవాదమే ప్రచారం చేయడం వల్ల గెలిచారని విమర్శకులు చెబుతారు. అయితే, మోడీ నేతృత్వంలోని బీజేపీ గతం కంటే ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధించిన మాట వాస్తవం.

అన్ని సార్లూ కుదిరేనా..!

అన్ని సార్లూ భావోద్వేగాలను రెచ్చిగొట్టి విజయం సాధించవచ్చునా అంటే కాదనే సమాధానమిస్తున్నారు విశ్లేషకులు. అయితే, భావుకత ప్రకటించడంలోని విశిష్టత మాత్రం ప్రజలను అశేషంగా ఆకర్షిస్తుందని చెబుతున్నారు. అందుకే ‘హౌడీ మోడీ’, ‘కెమ్ చో ట్రంప్ లేదా నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు ప్రాధాన్యముంటుందని అంటున్నారు. ఢిల్లీలో కేజ్రీ ‘వాల్’ బ్రేక్ చేయడంలో కమలం విఫలమయిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఏడాది చివరలో ఎన్నికలున్నందున వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని నేతలకు బీజేపీ చీఫ్ నడ్డా ఆదేశాలు, జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మారాండి నేతృత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) బీజేపీలో విలీనమైన విషయాలు తెలిసినవే. అంతేగాకుండా రెట్టింపు ఉత్సాహంతో ప్రధాని మోడీ వారణాసి పర్యటనలో రిక్షా కార్మికుడి ఇంటికి వెళ్లడం, జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో మాట్లాడటం ప్రజల్లోకి వెళ్లింది.

మట్టికప్పులో ఛాయ్ తాగి..

బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశమై పూర్తి చేసుకున్న అనంతరం మోడీ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న ‘హునర్ హాట్’ మేళాకు వెళ్లి కాసేపు సరాదాగా గడిపారు. ఓ చిరుతిళ్ల దుకాణంలో లిటి చోఖా తిని, కేంద్రమంత్రి నఖ్వీతో కలిసి మట్టి కప్పులో ఛాయ్ తాగి సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
ఈ నెల 24న అమెరికా అధ్యక్షులు ట్రంప్ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు రావడం మోడీకి సహజంగానే కొత్త ఉత్సాహాన్నీ, సరికొత్త ప్రచారాన్నీ కల్పిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, ట్రంప్ భారత్‌కు రావడం వెనుక ఆయన స్వ రాజకీయం ఉందనీ పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు ఈ యాత్ర ఉపకరిస్తుందనీ, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు తన‌వైపు మొగ్గు చూపుతారని అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed