అయిపాయే.. టూర్లు లేవు.. డబ్బులు లేవు.. నైరాశ్యంలో ఓటర్లు

by  |
అయిపాయే.. టూర్లు లేవు.. డబ్బులు లేవు.. నైరాశ్యంలో ఓటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వం నుంచి అధిక నిధులు వస్తాయని భావించిన స్థానిక ప్రజాప్రతినిధులు అధికారపార్టీకి చెందిన వారికి పూర్తి మద్దతు ప్రకటించారు. పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినా విత్ డ్రా చేసుకున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అనుకున్నదొకటి.. అయింది మరొకటి. కనీసం కొంతైనా ఇస్తారని అనుకుంటే ఏమీ ఇవ్వలేదని, కనీసం టూర్లకైనా తీసుకొనిపోవడం లేదని మధన పడుతున్నారు. ఎవరైనా ఒకరు పోటీలో ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోటీ జరుగుతున్న ఐదు జిల్లాలకు చెందిన స్థానిక ఓటర్లు టూర్లల్లో ఎంజాయ్ చేస్తుంటే ఏకగ్రీవమైన జిల్లాల్లో మాత్రం నిరాశకు గురవుతున్నారు. కనీసం టూర్లకైనా తీసుకెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఏకగ్రీవ జిల్లాలకు చెందిన ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా అధికార పార్టీకి చెందిన వారితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 12 స్థానాలకు నామినేషన్ వేశారు. అయితే 6 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ కు చెందిన అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత, రంగారెడ్డిలో పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్ నగర్ లో కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, వరంగల్ లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. అయితే ఏకగ్రీవం అయితే ప్రత్యేక నిధులు వస్తాయని, చేతికి నగదు వస్తుందని ఆశించారు. కానీ నేటి వరకు ఎలాంటి నగదు రాలేదు. నిధులు లేవు. దీంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉంటే తమకు న్యాయం జరిగేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోటీలో ఉన్న కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్ కు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు టూర్లలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాకుండా కొంత నగదును కూడా ముట్టచెబుతున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆయా జిల్లాల్లో బరిలో ఉన్న వారు సైతం నగదు ఆశ చూపడంతో వారికి లక్ష్మీ కలిసివస్తోంది. దీంతో ఏకగ్రీవమైన జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు కోఆప్షన్ సభ్యులు లోలోన మధనపడుతున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న వారు సైతం బరిలో ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బరిలో ఉంటే మాకు కలిసివచ్చేదని ఏకగ్రీవం జరిగిన ఓ జిల్లాకు చెందిన ఎంపీటీసీ తన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడగానే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఇది గమనించిన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మండలాల వారీగా పిలిచి మాట్లాడారు. వార్నింగ్ లు సైతం ఇచ్చారు. మరో రెండేళ్లు సమయం ఉందని… నిధులు కావాలంటే ప్రభుత్వానికి సహకరించాలని వార్నింగ్ లు సైతం ఇచ్చారు. లేకుంటే అభివృద్ధికి సహకరించబోమని వెల్లడించడంతో వేసిన నామినేషన్లను స్వతంత్ర అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం. ఏకగ్రీవం కావడంతో టూర్లు, డబ్బులు లేకుండా పోయింది. దీంతో వారి పరిస్థితి ముందు నుయ్యి… వెనుక గొయ్యి అనే పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో… ఎవరిని అడగాలో తెలియక మధనపడుతున్నారు అధికారపార్టీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లు.. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన ఓటర్ల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. అధికారంలేదు… టీఆర్ఎస్ కు చెందిన వారు దగ్గరకు రానివ్వరు. దీంతో వారు ఏవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నారు.

ఎన్నికలు జరుగుతున్న ఐదు జిల్లాల ప్రజాప్రతినిధులు టూర్లలో ఎంజాయ్ చేస్తుండటంతో ఏకగ్రీవమైన జిల్లాలకు చెందిన ఓటర్లు మాత్రం మధన పడుతున్నారు. తమను ఒక్కరోజైనా టూర్లకు తీసుకెళ్లాలని తమకు సన్నిహితంగా ఉన్న నేతలతో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోనీ… కుటుంబంతో టూర్లకైనా తీసుకెళ్తే బాగుండేదని పలువురు బహిరంగా పేర్కొంటున్నారు. అనవసరంగా ఏకగ్రీవం చేశామేమోనన్న భావన వారిలో నెలకొంది. ఏదీ ఏమైనప్పటికీ ఏకగ్రీవమైన జిల్లాల్లోని స్థానిక సంస్థల సభ్యులు మాత్రం మధనపడుతున్నారు.


Next Story

Most Viewed