గోవా ట్రిప్‌కు ఎమ్మెల్సీ ఓటర్లు

by  |
గోవా ట్రిప్‌కు ఎమ్మెల్సీ ఓటర్లు
X

దిశ, పాలేరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యం కావడంతో శిబిర రాజకీయం షురూ అయింది. ఎవరు ఎవరిని లాక్కుంటారో తెలియని పరిస్థితుల్లో పాలేరు నియోజకవర్గంలో తెరాసకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సోమవారం గోవాకు తరలిస్తున్నట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గం మొత్తం ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉంది. ఇక్కడ ద్విముఖ పోటీ నేపథ్యంలో తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను చేజారకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా శిబిర రాజకీయాలకు తెరతీశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అందరినీ పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల క్యాంపు కార్యాలయానికి పిలిపించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ మార్గ నిర్దేశం అనంతరం సోమవారం ఉదయమే ఒక బస్సు,రెండు కార్లలో హైదరాబాద్‌ మీదుగా విమానంలో గోవాకు వెళ్లనున్నారు. ఇక తెరాస తరఫున తాత మధుసూదన్,కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు అభ్యర్థులుగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో అధికార టీఆర్ఎస్ కు మెజారిటీ ఓటర్లు ఉన్నా.. అవి చీలకుండా ఉండేందుకు శిబిరం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, శిబిరానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుమలాయపాలెం, రూరల్ మండలాల నుంచి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు వెళ్లే విమానం క్యాన్సిల్ అయినట్లు సమాచారం. దీంతో తర్వాతి విమానంలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు హైదరాబాద్ లోని ఓ రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజాప్రతినిధులను డిసెంబరు 10న పోలింగు రోజున నేరుగా బస్సులో పోలింగ్‌ కేంద్రానికి తీసుకువస్తారని సమాచారం. అయితే ఈ శిబిరానికి ఈ కూసుమంచి, నేలకొండపల్లి మండలాల నుంచి సగం మంది మాత్రమే వెళ్లినట్లు తెలుస్తోంది.


Next Story