మీది మాది పేగు బంధం.. మిమ్మల్ని మరువం

by  |
మీది మాది పేగు బంధం.. మిమ్మల్ని మరువం
X

దిశ, షాద్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమంలో కలిసి పోరాడిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో టీఆర్ఎస్‌కు పేగుబంధం ఉందని.. మిమ్ములను మరిచే ప్రసక్తేలేదని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రభుత్వ ఉద్యోగులను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, కరోనా వలన ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల పీఆర్సీలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, ప్రమోషన్లు, పీఆర్సీ సమస్యలు ఎవరు గెలిస్తే పరిష్కారం అవుతాయో ఉద్యోగస్తులు ఆలోచించాలన్నారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాదాపు లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తుచేశారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు అభివృద్ధిపై ఎలాంటి తప్పు దొరకపోవడంతో కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని 1,2 సీట్లు గెలవగానే గతంలో 100 సీట్లలో డిపాజిట్‌లు గల్లంతు మరిచారన్నారు. కేసీఆర్ వచ్చాకే తెలంగాణలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో లెక్క చెప్పి ఓట్లు అడగాలన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరేళ్ళ కాలంలో 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి దక్కలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఇచ్చారో బయట పెట్టాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 5 నుండి 10 లక్షల ఎకరాల్లో నీరు పారే ప్రాజెక్ట్ ఏదైనా కట్టారా.. అదే తెలంగాణలో ప్రాజెక్ట్‌లతో 75 లక్షల ఎకరాల భూములు సశ్యశ్యామలం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి మాట్లాడుతూ.. దయనీయ స్థితిలో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ పటంలో నిలిపిన ఘనత పీవీ నరసింహారావు దైతే, తెలంగాణ రాష్ట్రం ఇక రాదనుకున్న సమయంలో మలిఉద్యమాన్ని తన భుజాలపై నెత్తుకొని ప్రజల కలను సాకారం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిదన్నారు. బంగారు తెలంగాణలో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వొద్దు. తనను గెలిపిస్తే మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాపరెడ్డి, భీష్మ కిష్టయ్య, నాయకులు అందే బాబయ్య, రవీందర్ యాదవ్, ఈట గణేష్, రాంబల్ నాయక్, నరేందర్, నటరాజ్, విశ్వం, వెంకట్ రామ్ రెడ్డి, తాండ్ర విశాల, రామకృష్ణారెడ్డి, వర్కాల లక్ష్మీ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed