వివాదాలకు కేరాఫ్‌.. ఎమ్మెల్యే కోనప్ప?

by  |
వివాదాలకు కేరాఫ్‌.. ఎమ్మెల్యే కోనప్ప?
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్-కాగజ్‌నగర్ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో ఒక రకమైన ఆరోపణలు ఆయనను వెంటాడుతున్నాయి. దశాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆయన కుటుంబం కాగజ్‌నగర్‌లో స్థిరపడింది. రాజకీయాల్లోకి వచ్చిన కోనప్ప ఆ నియోజక వర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే‌గా గెలిచారు. నియోజక వర్గ అభివృద్ధి విషయంలో దూకుడు‌గా ఉంటారని పేరుంది. గతంలో అనేక సందర్భాల్లో అధికారులతో గొడవ పడేవారు. అయితే ఈ దఫా‌లో మాత్రం ఆయన వివిధ ఆరోపణలు, ఆక్రమణలు, అధికార వర్గాలతో ఘర్షణలు వంటి వివాదాలతో సతమతమవుతున్నారు.

ఉత్తమ్ ఫిర్యాదు‌తో తీవ్ర దుమారం

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యే కోనప్ప‌పై చేసిన ఫిర్యాదు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. సిర్పూర్ నియోజక వర్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్నచెట్లను మూడ్రోజుల క్రితం నరికి వేశారు. దీనిపై పీసీసీ చీఫ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రికి ట్వీట్ చేశారు. మీ పార్టీ ఇంటి దొంగలు.. అంటూ కోనప్ప‌ను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్ చేశారు. అలాగే 40 చెట్లను నరికి కోనప్ప తన ఇంటికి తరలించుకున్నాడని, ఆ అవినీతి పరుడు‌పై చర్యలు తీసుకోవాలని లేదంటే.. హరితహారం కార్యక్రమానికి అర్థమే లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల పరంపరతో కాగజ్ నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లే భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. సిర్పూర్ కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సమాచారం మేరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు చెబుతుండగా.. అధికార టీఆర్ఎస్‌లోనే కోనప్పకు పడరాని వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉప్పందించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అసలేం జరిగింది?

సిర్పూర్ నియోజక వర్గం‌లో ఒక ప్రధాన రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. కొట్టిన చెట్లను ఎమ్మెల్యే కోనప్ప ఇంటికి తరలించారన్నఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పీసీసీ చీఫ్ ఫిర్యాదు చేశారు. అయితే కోనప్ప మాత్రం దీన్ని ఖండించారు. ఆరోపణలు నిరాధారమన్నారు. రాష్ట్ర స్థాయి నేత మాట్లాడాల్సిన మాటలు కావంటూ ఉత్తమ్‌పై కోనప్ప ఫైర్ అయ్యారు. చెట్ల నరికివేత‌తో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. ఆయన అనుయాయులు సైతం ఖండనల పర్వానికి తెర లేపారు. ఆర్ అండ్ బి టెండర్ల మేరకు తాను కొనుగోలు చేసి చెట్లు నరికానని ఓ కాంట్రాక్టరు చెప్పారు. ఈ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

గతంలోనూ వివాదాలే..

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఏడాది సిర్పూర్ నియోజకవర్గం‌లో అటవీ రేంజ్ అధికారి‌పై ఆయన తమ్ముడు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు దాడిచేసి గాయపరిచిన ఘటన జాతీయ స్థాయిలో వివాదం అయింది. దీనిపై కోనప్ప ముఖ్యమంత్రికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా కాగజ్ నగర్ పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఉన్న ఒక స్థలం ఆయన తనయుడు కోనేరు వంశీ పేరిట రిజిస్టర్ కావడం కూడా వివాదానికి కారణమైంది. దీనిపై వ్యవహారం మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్లింది. తాజాగా చెట్ల నరికివేత వ్యవహారం ఎమ్మెల్యే కోనప్పకు తలనొప్పిగా తయారవుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడమే వివాదం పెరగడానికి కారణమైంది. వాస్తవాలు ఏమిటన్నది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాకపోయినా.. ఆయన మాత్రం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ప్రజల కోసం పనిచేసే ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన కోనప్ప.. తాజాగా సొంత వ్యాపకాల్లో అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుండటం రాజకీయంగా ఆయనకు ప్రతికూల అంశం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా‌ రు.

సొంత పార్టీలో పెరుగుతున్న శత్రువులు

గతంలో నియోజకవర్గం తప్ప ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శత్రువులు ఉండేవారు కాదు. కానీ తాజాగా ఆయనకు ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా శత్రువర్గం పెరుగుతోంది. గతంలో అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఒక సీనియర్ నేతతోనే ఇప్పుడు కోనప్ప‌కు పొసగడం లేదని ప్రచారం ఉంది. అలాగే తూర్పు జిల్లాలోని కొందరు ముఖ్య నేతలు వ్యతిరేకంగా జట్టు కట్టినట్లు తెలుస్తోంది. సిర్పూర్ కాంగ్రెస్ నేత పాల్వాయి హరీశ్‌తో పాటు కొందరు అధికార పార్టీ నేతలే కోనప్పపై తాజా ఫిర్యాదు చేసినట్లు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed