ఆ చిన్నారులను అక్కున చేర్చుకున్న ఎమ్మెల్యే గండ్ర

by  |
MLA Gandra Venkata Ramana Reddy
X

దిశ, చిట్యాల: తల్లి, తండ్రిని చిన్నవయసులోనే కోల్పోయిన నలుగురు పిల్లల భవిష్యత్తుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి భరోసానిచ్చారు. అనాథలుగా మిగిలిన నలుగురు చిన్నారులను అక్కున చేర్చుకుని వారి చదువుల కోసం ప్రతి సంవత్సరం రూ. 20 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం పాశిగడ్డతండా గ్రామానికి చెందిన భూక్య సుజాత సురేష్ దంపతులకు నలుగురు పిల్లలు. కాగా, గత నాలుగేళ్ల క్రితం క్షయ వ్యాధి బారినపడి సురేష్ మృతిచెందాడు. దీంతో భార్య కూలి పనులు చేసుకుంటూ నలుగురు పిల్లలు తిరుపతి(14), లక్షపతి(12), సంజన(10), శేషు(6)లను పోషిస్తోంది. ఇటీవలే విష జ్వరం బారిన పడిన సుజాత కూడా మృతిచెందింది.

దీంతో నలుగురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. పేద కుటుంబం కావడంతో సుజాత అంత్యక్రియలను గ్రామస్తులంతా ఏకమై నిర్వహించారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి గ్రామానికి చేరుకొని ఆదివారం చిన్నారులను పరామర్శించారు. తక్షణమే వారు నివాసం ఉంటున్న ఇంటిని మరమ్మతులు చేయించాలని, అందుకు ఖర్చు అవుతున్న డబ్బులు తామే భరిస్తామని స్థానిక టీఆర్ఎస్ నాయకులను ఆదేశించారు. వారి ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… చిన్నారుల భవిష్యత్తు, చదువు బాధ్యతలు తాము తీసుకుంటామని, గ్రామస్తులు సైతం చిన్నారులను మంచి మనసుతో అక్కున చేర్చుకోవాలని కోరారు.

వారికి ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నూతన వస్త్రాలను అందిస్తామన్నారు. చదువుకోవడం కోసం అధికారులతో మాట్లాడి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, కాలేజ్‌లో చేర్పించి సక్రమమైన మార్గంలో నడిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. పెద్ద కుమారుడి ఇంటర్ చదువు కోసం మెరుగైన కళాశాలలో చేర్పించి ఆదుకుంటామన్నారు. చిన్నారుల భవిష్యత్తుపై ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, స్థానిక సర్పంచ్ లావుడ్యా రజిత హరిభూషన్, వెంకటేష్, సంపత్, రాజేందర్, రాజునాయక్, రాజు, అశోక్ పాల్గొన్నారు.


Next Story