బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం

by  |
MLA Gandra Venkata Ramana Reddy
X

దిశ, భూపాలపల్లి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ నేతల పాదయాత్రలు రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేయడం విడ్డూరంగా ఉన్నారు. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే చట్టాలు తీసుకొచ్చి, పేదల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏడాదికాలంగా ఢిల్లీలో రైతులు పోరాడుతున్నా.. మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హర్యానాలో శనివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై విచక్షణారహితంగా దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలన నాటి ఆంగ్లేయ పాలకులను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. విభజన సమయంలో చేసిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఎందుకు ప్రైవేట్ పరం చేస్తోందని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయడాన్ని విరమించుకోవాలని అన్నారు. ఈ విషయాలపై బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. తెలగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేంద్రం ఇంతవరకు కల్పించకపోవడం ఏమిటని మండిపడ్డారు. ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించాలని, కాజీపేటలో రైల్వే పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు కేంద్రం, వివక్ష చూపకుండా నిధులు కేటాయించాలని కోరారు.


Next Story