కేసీఆర్ ‘గొర్రెల పంపిణీ’ ఎందుకు చేస్తున్నారో చెప్పిన మంత్రి తలసాని..

by  |
talasani-Srinivas-Yadav
X

దిశ, జమ్మికుంట : రాష్ట్రంలోని గొల్ల, కురుమల ఆర్థిక అభివృద్ధి కొరకే గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి తలసాని గొల్ల, కురుమలను ఉద్దేశించి మాట్లాడారు.

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికీ ఏ ప్రభుత్వం గొల్ల, కురుమలను ఆదుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. గొల్ల, కురుమలను ఆదుకోవడం కోసమే గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే చేత కానోడు, పనికి రానోడు, పనికిమాలిన వాళ్ళు, ఈ పథకాల వల్ల వచ్చేది లేదు అంటూ కించపరిచే విధంగా మాట్లాడుతూ దొంగ ప్రచారం చేస్తున్నారని వారి తీరుపై దుమ్మెత్తిపోశారు.

దళిత బంధు, గొర్రెల పంపిణీ తదితర పథకాలు కేవలం హుజురాబాద్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. ఓ నేతకు ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదని, పదవి పోయిన తర్వాత గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి సంస్కారం ఉండబట్టే మిగతా నాయకులు లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదని అన్నారు. అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సాగునీటితో బీడు భూములు సస్యశ్యామలమై పచ్చదనంతో కళకళలాడుతున్నాయనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రావు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పశుసంవర్ధక శాఖ ఎండీ రామ్ చందర్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story