ఉపాధి పెంచేందుకు కృషి చేస్తున్నాం: మేకపాటి

by  |
ఉపాధి పెంచేందుకు కృషి చేస్తున్నాం: మేకపాటి
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో యువత ఉపాధిని పెంచేందుకు పెట్టుబడులకు పెద్ద పీట వేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. విజయనగరంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి పోటీకి తగ్గట్లు మానవ వనరులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకోసం వచ్చే పారిశ్రామిక వేత్తలకు తక్కువ ఖర్చుతో, తక్కువ రిస్క్ ఉండేలా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. నిరుద్యోగులు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి ప్రభుత్వ శాఖల నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమలకు కావలసిన భూమి, నీటి సౌకర్యం, మానవ వనరులను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా.. 23 ప్రభుత్వ శాఖల ద్వారా 301 రకాల సంస్కరణలు తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. పారిశ్రామిక వేత్తలకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి గౌతం రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందన్నారు. దేశంలోనే అత్యుత్తమ సీఎంలలో ఒకరిగా నిలవడం జగన్ సుపరిపాలనకు నిదర్శమని మంత్రి మేకపాటి హర్షం వ్యక్తం చేశారు.


Next Story