‘నేనొచ్చే దాక మార్పు రాదా?’

by  |
‘నేనొచ్చే దాక మార్పు రాదా?’
X

దిశ, మెదక్: స్వచ్చ సిద్దిపేట మన లక్ష్యంగా, ప్రజల్లో మరింత మార్పు కోసం తానే స్వయంగా వార్డు బాట పట్టారు. మంత్రి తన్నీరు హరీశ్ రావు తెల్లవారు జామునే సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో కలియతిరిగారు. స్వచ్చ సిద్దిపేటలో భాగంగా తడి, పొడి చెత్త విభజన ప్రక్రియకు సహకరిస్తున్న వైనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్లక్ష్యంగా ఉన్న కొన్ని వార్డుల తీరుతెన్నులను గుర్తించిన మంత్రి పారిశుద్ధ్య కార్మికుడిగా మారి స్వయంగా తడి,పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని వివరించారు. ‘స్వచ్ఛత విషయంలో నేనొచ్చే దాక మార్పు రాదా అని ప్రశ్నించారు. మార్పు రాకపోతే జరిమానాల వరకు వెళ్లాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. సంబంధిత సమయ వేళలపై పలు చోట్ల మహిళలు మంత్రికి ఫిర్యాదు చేయడంతో స్పందించి వెంటనే శానిటరీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణను పిలిచి చెత్త సేకరణకు వస్తున్న సమయం, వాహనాల వేళలు, ప్రజల సహకారం గురించి ఆరా తీశారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి సమస్యను పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.
పట్టణంలోని 33వ వార్డులో మార్నింగ్ వాక్ చేస్తున్న మంత్రి హరీశ్ రావుకు ఒక ఇంటి వద్ద పదుల సంఖ్యలో జనం ఉండి, మంత్రి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో వారి వద్దకు వెళ్ళిన మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఇంట్లో మంచి దావత్ జరిగినట్టుందని, జనం బాగున్నారని అడుగుతూనే ఫంక్షన్‌లో ప్లాస్టిక్ వినియోగించారా? అంటూ ఆరా తీశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే ఇబ్బందులను గురించి వివరించారు. అందరం కలిస్తేనే స్వచ్ఛ సిద్ధిపేట సాధ్యమవుతుందని, అందుకు మీ సహకారం ఉండాలంటూ ఇదే మాటగా ప్లాస్టిక్‌పై ఎక్కడికక్కడా చైతన్యం తేవాలని ప్రజలకు అవగాహన కల్పించి పిలుపునిచ్చారు.
4 గంటలు.. 4 ఫొటోలు తప్పనిసరి
ప్రతి కౌన్సిలర్ తెల్లవారుజామున వార్డులో పారిశుద్ధ్య వాహనం వెంట తిరగాలని, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మీ కోసం నా ఫోన్ ఎదురు చూస్తుంటుందని తెలిపారు. వార్డుల్లో ఉదయం చెత్త సేకరణపై కౌన్సిలర్లు గంట గంటకు ఫొటో తీసి నాకు వాట్సాప్‌లో పంపించండి. మీరు ఫొటో పెట్టకుంటే ఆ రోజు చెత్త సేకరణను పర్యవేక్షించలేదని భావిస్తాను. మీ మీద నాకున్న నమ్మకానికి ఫొటోలే ప్రతీక అని కౌన్సిలర్లకు సూచించారు.

tags : Minister Harish Rao, Morning Walk, siddipet, Awareness on wet and dry trash, Plastic

Next Story

Most Viewed