దశల వారీగా డబుల్ బెడ్రూంలు: హరీశ్ రావు

by  |
దశల వారీగా డబుల్ బెడ్రూంలు: హరీశ్ రావు
X

దిశ ,సిద్దిపేట: పట్టణంలో గూడు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం తమ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బుధవారం ఆయన నర్సా పూర్ కాలనీలో 180 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల నిజం కాబోతున్నదుకు ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నర్సాపూర్ లో 2,460 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఇందుకు నాలుగేళ్ల సమయం పట్టిందని, నాలుగు వందలసార్లు నిర్మాణ స్థలాన్ని సందర్శించి మనసు పెట్టీ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామని అన్నారు.

మొదటి దశలో 1,341 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఆరు నెలలు కష్టపడి పేదరికమే ప్రామాణికంగా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. ఇందుకోసం కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్ఓ సహా 200 మంది అధికారులు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తొలి దశలో ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది గృహ ప్రవేశం చేశారన్నారు. ప్రతీ ఇంటిలో విద్యుత్, నల్లా, గ్యాస్ కనెక్షన్, పైపులు అన్ని సక్రమంగా పని చేస్తున్నాయో లేదో సరి చూశామన్నారు. మిగిలిన 1,000 ఇండ్లకు సంబంధించి పున: పరిశీలన జరుగుతోందని, అర్హులకు త్వరలోనే ఇండ్లను కేటాయిస్తామని అన్నారు. కేటాయించిన పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులదేనన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

రోజూ బస్సు

ప్రజల విజ్ఞప్తి మేరకు కేసిఆర్ నగర్ కు ప్రతి రోజు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కేసిఆర్ నగర్ నుంచి కోటి లింగాలు, కాలకుంట వరకు బస్సు నాలుగు ట్రిప్పులు తిరిగేలా చూడాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. కేసిఆర్ నగర్ కు బస్తీ దవాఖానా వచ్చే వరకు ఒక ఏఎన్ఎం, ఆశ వర్కర్ తో తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారి కి సూచించారు. సమీకృత మార్కెట్ లోని అన్ని షాపులను నాలుగు రోజులలో డ్రా ప్రాతిపాదికన కేటాయించాలన్నారు. త్వరలోనే కేసిఆర్ నగర్ కు బడి, రేషన్ షాప్, గుడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలన్నారు. అనంతరం మంత్రి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ పాల సాయి రాం, ఆర్డీఓ జయచంద్రా రెడ్డి , సుడా వైస్ చైర్మన్ రమణాచారి , మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed