కేంద్రం నిర్ణయం దారుణం.. కేసీఆర్ వల్లే రైతులకు మేలు

by  |
minister gangula
X

దిశ, కరీంనగర్ సిటీ : సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో పంటల సాగుకు అవసరమైన వసతుల కల్పన జరిగిందని, కేంద్ర ప్రభుత్వం దొడ్డు వరి ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో రైతాంగం నష్టపోకుండా ఇతర పంటలు ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రూరల్ మండలంలోని తాహెర్ కొండాపూర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన అనంతరం ఆ గ్రామ రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పండిన పంటను సేకరించడం, నిల్వ, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతను, రాష్ట్ర ప్రభుత్వాలకు నాణ్యమైన కరెంటు, నీరు, పెట్టుబడి సాయం, ఇతర మౌళిక వసతులను రైతులకు కల్పించే అధికారం మాత్రమే ఉందన్నారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్ర రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అనుకూలమైన ఆయిల్ ఫామ్ ఇతరత్రా ప్రత్నామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించాలన్నారు. పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజల ముంగిటకే పాలనను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. నూతన జిల్లాలు, మండలాలతో పాటు అనేక తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలందించడానికి ప్రతీ గ్రామపంచాయతీలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు, పక్కా భవనాలతో పాటు పల్లె పకృతి వనాలు, రైతు చర్చావేదికలు, వైకుంఠ ధామాలు నిర్మిస్తూ పల్లెల రూపు రేఖల్ని సంపూర్ణంగా మార్చివేసామన్నారు. గాందీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేసారని, భవిష్యత్తులో తెలంగాణ పల్లెలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నేతలు, ప్రభుత్వ అధికారులు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed