బిల్లు కట్టకుంటే డెడ్ బాడీ ఇవ్వరా?.. మంత్రి ఈటల ఆగ్రహం

by  |
బిల్లు కట్టకుంటే డెడ్ బాడీ ఇవ్వరా?.. మంత్రి ఈటల ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కష్టకాలాన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు కాసులు సంపాదించుకునేందుకు వాడుకోవడంపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు కట్టకపోతే డెడ్ బాడీలను బంధువులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. కరోనా పేషెంట్లకు ఎంత ఛార్జీ చేయాలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన జీవో ద్వారా చెప్పిందని, ఇప్పటికీ అది అమల్లోనే ఉందని, అయినా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆక్సిజన్ కొరతను సాకుగా చూపి పేషెంట్లే వారికి అవసరమైన ఆక్సిజన్‌ను తెచ్చుకోవాలని, రెమిడెసివిర్ మందుల్ని తెచ్చుకోవాలన్న షరతు పెట్టడం మంచి పద్ధతి కాదని, అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలంటూ పేషెంట్లపై ఒత్తిడి చేయడం మానవత్వం అనిపించుకోదన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, ప్రభుత్వ హెల్త్ కార్డులు ఉన్నా.. పేషెంట్లను అడ్మిట్ చేసుకోకపోవడం సభ్యసమాజం హర్షించే విషయం కాదన్నారు. వ్యాపార కోణంలో చూడకుండా మనుషుల్లాగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను, ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలన్నారు. అవకాశం వచ్చింది కదా అని సంపాదించుకోవటం సబబుకాదని, తీరు మార్చుకోవాలని కోరారు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయని, ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయని గుర్తుచేశారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఇకపైన ఉపేక్షించబోమన్నారు.

ఆక్సిజన్ కొరత లేదు..

ఆక్సిజన్ అందుబాటులో లేక చాలా మంది చనిపోతున్నారని వార్తలు రావడంతో యుద్దవిమానాల్లో ట్యాంకులను పంపించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అందిస్తున్నామని మంత్రి ఈటల గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని, రాష్ట్రంలో 270 టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉంటే 400 టన్నులను కేంద్రం కేటాయించిందన్నారు. ఎక్కువ దూరంలో ఉన్న ఒరిస్సా నుంచి కాకుండా బళ్లారి నుంచి ఆక్సిజన్‌ను అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాయడంతో సానుకూలంగా స్పందనే వచ్చిందన్నారు. జిల్లాలోని కొన్ని ఆసుపత్రులు ఆక్సిజన్ సరఫరా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ఇబ్బందుల వల్ల సప్లై నిలిచిపోయిందన్నారు. ముందుచూపుతో 22 ఆసుపత్రుల్లో 20 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోగలిగామన్నారు.

‘పీఎం కేర్స్‘ ద్వారా ఐదు ఆక్సిజన్ జనరేటర్ మిషన్లు (పీఎస్ఏ) ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, ఇటీవల మరో పన్నెండు ఆస్పత్రులకు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. గాంధీ ఆస్పత్రిలో రోజుకు 28 లక్షల లీటర్ల, గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో 14 లక్షల లీటర్ల, ఖమ్మం ఆస్పత్రిలో 8.5 లక్షల లీటర్ల, భద్రాచలం ఆసుపత్రిలో 4.5 లక్షల లీటర్ల, కరీంనగర్‌లో 5.5 లక్షల లీటర్ల ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. వీటన్నింటి ద్వారా రోజుకి 62 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకోగలమన్నారు. ఇవన్నీ పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత భవిష్యత్తులో ఆక్సిజన్ సమస్యలే ఉండవన్నారు.

నేటి నుంచి నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా వార్డులు..

గతేడాది కరోనా సందర్భంగా కేవలం 1,770 ఆక్సిజన్ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పదివేల పడకలకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసిందన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్‌ల డిమాండును దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 3,010 పడకలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో పూర్తి స్థాయి సిబ్బందితో 350 ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉన్నాయని, బుధవారం నుంచి కరోనా పేషెంట్లకు వినియోగంలోకి వస్తాయన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో కూడా 200 అక్సిజన్ పడకలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బంది విషయంలోనూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 755 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాల్లో కూడా ఇలాంటి నియామకాలు చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చినట్లు తెలిపారు.

కేంద్రం తీరు సరికాదు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల పన్నుల ద్వారా డబ్బులు సమకూరుతున్నాయని, కానీ దీన్ని మర్చిపోయిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ధరలను రాష్ట్రానికి ఒక రకంగా, కేంద్రానికి ఒక రకంగా నిర్ణయించడం సమంజసం కాదన్నారు. కరోనా కట్టడి కోసమే కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను బడ్జెట్‌లో పెట్టిందని, దీన్ని ఖర్చు చేయకుండా రాష్ట్రాలే వ్యాక్సిన్లను కొనుక్కోవాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనమన్నారు. వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చి రాష్ట్రాలకు అందజేయాలని నొక్కిచెప్పారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ కొనుక్కోవాలంటూ కేంద్రం చెప్పడం బాధాకరమన్నారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. మన దేశంలో ఉత్పత్తి అయిన మందులను ఇతర దేశాలకు తరలించిన కేంద్ర ప్రభుత్వం ఇకపైన కూడా అదే ధోరణి కొనసాగిస్తే చరిత్ర క్షమించదన్నారు.



Next Story

Most Viewed